AnganWadi
Anganwadi Jobs: తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ విడుదలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మొత్తం 14,236 పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలుపై మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. ఇందులో 6,399 టీచర్లు, 7,837 హెల్పర్ల పోస్టులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత అంగన్ వాడీ, హెల్పర్ల పోస్టులను భర్తీ చేస్తున్న తొలి నోటిఫికేషన్ ఇదేనని అధికారులు పేర్కొంటున్నారు.
Also Read: Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బంపర్ ఆఫర్.. మీకు ఎలా నచ్చితే అలా..
రాష్ట్రంలో మొత్తం 35,700 అంగన్ వాడీ సెంటర్లు ఉన్నాయి. 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. రాష్ట్రంలోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు, అంగన్ వాడీ కేంద్రాల్లో పూర్వప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా ఈ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తుంది.
కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల మేరకు అంగన్వాడీ టీచర్, హెల్పర్ల పోస్టుల కోసం కనీసం ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 18 నుంచి 35ఏళ్లు నిండిన వివాహిత మహిళలు మాత్రమే అర్హులు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం.. అంగన్ వాడీ టీచర్ పోస్టుల భర్తీలో 50శాతం సహాయకులకు కేటాయించాలి. అయితే, పనిచేస్తున్న సహాయకుల్లో ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన హెల్పర్లు 567 మంది మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారందరికీ పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి.