Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బంపర్ ఆఫర్.. మీకు ఎలా నచ్చితే అలా..
ఇందిరమ్మ హౌసింగ్ స్కీం కింద ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది.. ఖర్చు తక్కువతో ఇంటి నిర్మాణం కోసం నాలుగు మోడల్స్ ను..

Indiramma House Scheme
Indiramma House Scheme: ఇందిరమ్మ హౌసింగ్ స్కీం కింద ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలను అందజేస్తున్న విషయం విధితమే. అయితే, ఈ మొత్తాన్ని నాలుగు విడతల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తం సొమ్ములో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోలేని ఆర్థిక పరిస్థితి ఉన్నవారికి ఉపయుక్తంగా ఉండేలా నాలుగు నిర్మాణ పద్దతులను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. అయితే, ఈ నాలుగు పద్దతుల్లో ఒకదాన్ని అనుసరించాలని ఎలాంటి నిబంధన లేదని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం భవనాలను నిర్మిస్తున్నట్లుగా పిల్లర్లు, బీములతో కూడిన నిర్మాణ పద్దతి కాకుండా, ఖర్చు తక్కువ అయ్యేలా ఇతర పద్దతులపై లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మండలానికి ఒకటి చొప్పున, వేరువేరు పద్దతుల్లో మోడల్ ఇండ్లను నిర్మిస్తోంది. దీనికితోడు వీలైనంత ఎక్కువ మంది మేస్త్రీలకు ఆయా పద్దతుల్లో ఇళ్ల నిర్మాణాలపై శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈనెల 28 నుంచి జిల్లాల్లోని న్యాక్ సెంటర్లలో నిపుణుల ఆధ్వర్యంలో కూడా మేస్త్రీలకు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి.
Also Read: Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ముందు కట్టేది అక్కడే..
ఇందిరమ్మ హౌసింగ్ స్కీం కింద లబ్ధిదారుడు సాధారణ పద్దతిలో అయినా ఇంటిని నిర్మించుకోవచ్చని, ఆర్థిక పరిస్థితి సహకరించని పక్షంలో, నమూనా ఇంటిని చూసి ఆ పద్దతిలో ఇంటిని నిర్మించుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఇంటి విస్తీర్ణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలని ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన అధికారులు ఇప్పుడు ఆ విస్తీర్ణం 600 చదరపు అడుగులకు మించరాదని కూడా బలంగా చెబుతున్నారు. అయితే, ఇంటి విస్తీర్ణం పెరిగితే.. నిర్మాణ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ క్రమంలో లబ్ధిదారులు ఇంటిని అసంపూర్తిగా వదిలేస్తారన్న ఉద్దేశంతోనే ఇలాంటి నిబంధనలు పెట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
నాలుగు డిజైన్లు ఇలా..
షార్ట్ కాలమ్ కనస్ట్రక్షన్ : ఇళ్ల నిర్మాణంలో స్టీల్ వ్యయం చాలా ఎక్కువ. దీని వ్యయం తగ్గించేందుకు.. పునాదిస్థాయి వరకు మాత్రమే కాలమ్స్ ఉంటాయి. పైన ప్లింథ్ బీమ్స్ ఉంటాయి. మధ్యలో పిల్లర్లు లేకుండా కాంక్రీట్ గోడ ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్లలో పైఅంతస్తులు ఉండే అవకాశం లేనందున ఈ నమూనా బాగుంటుందని అధికారులు చెబుతున్నారు.
షియర్ వాల్ పద్ధతి: ఇందులో ఫ్రీఫ్యాబ్రికేటెడ్ గోడలను నిర్మాణ స్థలంలోనే ముందుగా సాంచాల ద్వారా కాంక్రీట్ తో సిద్ధం చేస్తారు. పునాదులపై రంధం డ్రిల్ చేసి రాడ్స్ ఆ గోడలను అనుసంధానిస్తారు. వాటి మీద పైకప్పు వేస్తారు. ఇందులో ఇటుక, స్టీల్ వ్యయం ఉండదు.
స్టోన్ రూఫింగ్ విధానం: కాంక్రీటు గోడలు నిర్మించిన తర్వాత పైన పూర్వకాలపు దూలాల తరహాలో ఆర్సీసీ రాఫ్టర్స్ ఏర్పాటు చేస్తారు. వాటి మీద షాబాద్ బండలు పరుస్తారు. ఆ బండల మీద తక్కువ మందంతో కాంక్రీట్ పొర వేస్తారు. షాబాద్ బండల లభ్యత అధికంగా ఉండే ప్రాంతాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
పిల్లర్ రూఫింగ్ నిర్మాణం: గోడలపై ఆర్సీసీ రాఫ్టర్లు అమర్చి వాటి మీద పూర్వకాలం తరహాలో బెంగళూరు పెంకులు పరుస్తారు. పెంకుల మీద రెండున్నర అంగుళాల మందంతో శ్లాబ్ వేస్తారు. ఈ విధానంలో ఇటుక, స్టీల్ వ్యయాన్ని తగ్గించొచ్చు.