Telangana Govt : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి రైతులకు మేలుచేసేలా అనేక పథకాలు అమలు చేస్తోంది. ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేయడంతోపాటు.. రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. అయితే, తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రైతులకు పంటల సాగులో ఆధునిక సాంకేతికను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రయోగాలు, ఆవిష్కరణల ఫలాలను అందించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలో రైతు విజ్ఞాన కేంద్రం (ఆర్‌వీకే) స్థాపించాలని నిర్ణయించింది. రైతులకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడం, పంటల మార్పిడి ఆవశ్యకతను వివరించడం, నేరుగా వరి విత్తనం వేయడం, పత్తిలో కలుపు మొక్కల నివారణ వంటి వాటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా డ్రోన్లు, యంత్రాల వినియోగం, కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి ఆదునిక సాంకేతిక సేవలను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటన్నింటి అమలుకు ప్రత్యేకంగా రైతు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుపై అధికారులు దృష్టిసారించారు. దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని అగ్రివర్శిటీని ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం తొమ్మిది ఏరువాక కేంద్రాలు, ఎనిమిది కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే, వీటిని ఆర్‌వీకేలుగా మారుస్తారు. మరో 15 జిల్లాల్లో కొత్త ఆర్‌వీకేలను ఏర్పాటు చేస్తారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆర్‌వీకేలు అందుబాటులోకి వస్తాయి. వీటిని ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి కేంద్రంలో ఆరుగురు చొప్పున శాస్త్రవేత్తలను నియమిస్తారు. ఇతర సహాయ సిబ్బంది ఉంటారు.
రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తారు. వాటికి అనుబంధంగా విత్తన, సాగు క్షేత్రాలు ఉంటాయి. వాటిలో డ్రోన్లు, యంత్రాలపై శిక్షణ ఇస్తారు. నిత్యం రైతు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ రైతులకు అధునాత సాగు విధానాలపై అవగాహన కల్పిస్తారు. తద్వారా రైతులు సాగుచేసిన పంటలు అధిక దిగుబడులు వచ్చేలా, ఫలితంగా వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.