Mutual Transfers
Mutual Transfers : తెలంగాణలో ఉద్యోగులకు అలర్ట్. పరస్పర బదిలీల (మ్యూచువల్ ట్రాన్స్ ఫర్) ప్రక్రియ మొదలైంది. పరస్పర బదిలీలు కోరుకునే ఉద్యోగులు ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ బదిలీలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో సీనియారిటీ ప్రొటెక్షన్ కల్పించనున్నట్టు వెల్లడించారు.
మ్యూచువల్ బదిలీల మార్గదర్శకాలను జీవో నెం.21లో పొందుపరిచామని, ఈ జీవో ఫిబ్రవరి 2న విడుదలైందని వివరించారు. అయితే, ఈ జీవోలోని 7వ, 8వ పేరాల్లో తెలిపిన నిబంధనలను ప్రభుత్వం సవరించిందని, దానిపై జీవో నెం.402ను ఫిబ్రవరి 19న తీసుకొచ్చిందని సోమేశ్ కుమార్ చెప్పారు.
మార్పులు చేసిన అనంతరం… ఉమ్మడి జిల్లా క్యాడర్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే, వారి సీనియారిటీకి కొత్త లోకల్ క్యాడర్ లోనూ ప్రొటెక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు.
పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకునే ఉద్యోగులు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా ఈ నెల 15 లోగా వివరాలు సమర్పించాలని వెల్లడించారు. ఇప్పటిదాకా మ్యూచువల్ బదిలీ కోరుతూ 31 దరఖాస్తులు వచ్చాయన్నారు.
డిసెంబర్ లో జీవో నెం. 317 అమల్లో భాగంగా ప్రభుత్వం ఉద్యోగుల విభజన చేపట్టింది. కొత్త జిల్లాలకు సీనియారిటీని ప్రామాణికంగా అలాట్‌మెంట్ చేశారు . కొన్నిచోట్ల దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే ఉద్యోగులకు మినహాయింపు కల్పించారు. అలాట్ మెంట్ ప్రక్రియపై రాష్ట్రవ్యాప్తంగా టీచర్లు ఆందోళనకు దిగడంతో ఎట్టకేలకు ప్రభుత్వం మ్యూచువల్స్ ట్రాన్స్ ఫర్స్ కు అవకాశం కల్పించింది. వాస్తవానికి తొలుత మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్ కు టీచర్లెవరూ సంసిద్ధత చూపలేదు.