Indiramma illu: ఇందిరమ్మ ఇంటికోసం అప్లయ్ చేశారా..? మీకు డబుల్ బెడ్రూం రావొచ్చు.. ఎలా అంటే?

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎల్-2 జాబితాలోని లబ్ధిదారులకు..

Double bedroom houses

Indiramma Illu: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రజాపాలనలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తులపై ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఇంటింటి కులగణన సర్వేతో ఈ సర్వేను సరిపోల్చుకుని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల జాబితాను ఎల్-1, ఎల్-2, ఎల్-3గా విభజించింది.

Also Read: Ration Card: రేషన్ కార్డుకోసం అప్లయ్ చేశారా..? మీకో అప్డేట్ ..

ఎల్-1లో సొంత స్థలం ఉన్న 21.93లక్షల మందిని చేర్చారు. వీరికి ఇంటి నిర్మాణం కోసం నాలుగు విడుతల్లో ప్రభుత్వం రూ.5లక్షలు మంజూరు చేయనుంది. అయితే, ఎల్ -2లో సొంత స్థలాలు లేని 19.96లక్షల మంది ఉన్నారు. వీరికి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు ఇచ్చే బదులు.. గత ప్రభుత్వం హయాంలో నిర్మాణంలో ఆగిపోయిన, నిర్మాణం పూర్తయినప్పటికీ పంపిణీ చేయని డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: Deepa Dasmunsi: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌గా దీపాదాస్‌ను తప్పించడంతో రిలాక్స్‌ అవుతున్నదెవరు?

గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో 2.36లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేయగా.. ఇందులో 1.58 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. వీటిలో 1.36లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లను గత ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేసింది. మిగిలిన డబుల్ బెడ్రూం ఇండ్లు అలాగే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బిల్లులు విడుదలకాక కాంట్రాక్టర్లు నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారు. ప్రస్తుతం వారితో హౌసింగ్ బోర్డు సంప్రదింపులు జరుపుతోంది. వారికి పలు రాయితీలు ఇచ్చి ఆ నిర్మాణాలను పూర్తి చేయించేలా అధికారులు దృష్టిసారించారు.

 

అసంపూర్తి నిర్మాణాలను పూర్తిచేసిన తరువాత వాటిని ఎల్ -2 జాబితాలోని లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, నియోజకవర్గాల్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లు, నిర్మాణాలు పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు కేటాయించకుండా ఉన్న ఇండ్లను గుర్తించి నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం జిల్లాల వారిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అక్కడక్కడ డబుల్ బెడ్రూం ఇళ్లకు లబ్ధిదారుల పేర్లను ప్రకటించినా వారికి కేటాయించలేదు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి వారు అర్హులైతే వారికే కేటాయించి, మిగతా డబుల్ బెడ్రూం ఇళ్లను ఎల్-2 జాబితాలోని లబ్ధిదారులకు కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.