Ration Card: రేషన్ కార్డుకోసం అప్లయ్ చేశారా..? మీకో అప్డేట్ ..
రేషన్ కార్డుకోసం అప్లయ్ చేసుకున్న వారికి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ పరిధిలో మార్చి మొదటి వారంలో ..

Indiramma Illu and Ration Card
New Ration Card: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. జనవరి 26న లాంఛనంగా ఈ ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే, ఎప్పటి నుంచి కొత్త కార్డులు పంపిణీ చేస్తారనే విషయంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ఈనెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మార్చి మొదటి వారంలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతో మార్చి నెలాఖరులోగా కొత్త రేషన్ కార్డులు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డుల్లో పేర్లు తొలగింపు, చేర్పించడం వంటి ప్రక్రియ కొనసాగుతుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తికాగా.. మార్చి మొదటి వారంలో వార్డు సభలు నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి మొదటి, రెండో వారాల్లోనే వార్డు సభలు పెట్టాలని అధికారులు భావించినప్పటికీ.. ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ పూర్తికాకపోవటంతో నిర్వహించలేదు.
ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 10,70,659 దరఖాస్తులు రాగా.. ఇందులో సర్వే ద్వారా అర్హులను గుర్తిస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియ వందశాతం పూర్తికావటానికి మరో పది నుంచి పన్నెండు రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో మార్చి మొదటి వారంలో వార్డు సభలు నిర్వహించాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు.
గ్రేటర్ లో రేషన్ కార్డుల కోసం 83,285 మంది అప్లయ్ చేసుకోగా.. దాదాపు 75వేల మంది అర్హులుగా ఎంపిక చేశారు. అయితే, వార్డు సభలు పెట్టకపోవటంతో అర్హులను ప్రకటించలేదు. వారం కింద మళ్లీ మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పడంతో ఇంతకుముందు అప్లయ్ చేసుకున్నవారు కూడా మళ్లీ దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. వార్డు సభలు పెట్టి అర్హుల జాబితాను ప్రకటించక పోవటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
అయితే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే మరో రెండు వారాల్లో పూర్తికానుండటంతో.. మార్చి మొదటి వారంలో గ్రామ సభలు నిర్వహించి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలను ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నగరవాసులు మాత్రం.. ఎలాగూ రేషన్ కార్డుల లబ్ధిదారులను ఫైనల్ చేశారు కాబట్టి వార్డు సభల కంటే ముందే అర్హుల జాబితా ప్రకటించాలని కోరుతున్నారు.