TS Rythu Bharosa Guidelines
Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం అర్హులైన రైతులకు ‘రైతు భరోసా’ నిధులు జమ చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 26వ తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపిన ప్రభుత్వం.. పంట పెట్టుబడి సాయాన్ని ఏడాదికి ఎకరాకు రూ.12వేలు అందజేస్తామని పేర్కొంది. సాగు భూములన్నింటికి పెట్టుబడి సాయం అందిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాజాగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే, రైతులకు సంబంధించిన విషయం కావడంతో పూర్తి స్పష్టత ఉండాలన్న ఉద్దేశంతో రైతు భరోసా పథకం-2025 మార్గదర్శకాల ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో జారీ చేసింది.
భూభారతి (ధరణి) పోర్టల్ లో నమోదైన వ్యవసాయ సాగు భూములకే రైతు భరోసా సాయం అందించనున్నట్లు ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. భూవిస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు దీన్ని అందించనున్నారు. అటవీ హక్కు చట్టం ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం అందజేస్తారు. రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే డీబీటీ పద్దతిలో రైతు భరోసా సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఫిర్యాదులు పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. అయితే, సాగుయోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనుంది ప్రభుత్వం.