Bhu Bharati: భూభారతి పోర్టల్ ప్రారంభంపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. పోర్టల్ లోగో ఎలా ఉంటుందంటే?

భూ భారతి పోర్టల్ ప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Bhubharati portal

Bhu Bharati: ధరణి పోర్టల్ లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా పకడ్బందీగా భూభారతి చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ పోర్టల్ ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్ నూ ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. ఈనెల 14న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతులు మీదుగా నూతన రెవెన్యూ చట్టం, పోర్టల్ ను ఆవిష్కరించేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కొత్త చట్టం అమలు, నియమ, నిబంధనలపై అదేరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయా..? అతనిపై బైక్ ఎలా పడింది..? పోలీసులు ఏం చెప్పారంటే..

భూ సమస్యలపై సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లా స్థాయి ట్రైబ్యునల్ ద్వారా పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించడం, 33 మాడ్యుళ్లను ఆరుకు కుదించడం వంటివి కొత్త చట్టంలో కీలక అంశాలుగా నిలవనున్నాయి. పాతదానిలో 33 మాడ్యూళ్లు ఉన్నాయి. రైతులు పోర్టల్లో దరఖాస్తు చేసే సమయంలో ఒకదానికి బదులు మరొక మాడ్యూల్ ను ఎంపిక చేస్తే తిరస్కారానికి గురికావడమో, లేదంటే సమస్య పరిష్కారం కాకపోవడమో జరిగేది. దీంతో ఈ గందరగోళానికి ముగింపు పలికేలా భూ భారతి పోర్టల్ లో మాడ్యూళ్ల సంఖ్యను ఆరుకు కుదించారు.

 

ధరణిలో కేవలం భూ యాజమాని పేరుతో మాత్రమే పహాణీ ఉండేది. ప్రస్తుతం భూ భారతి పోర్టల్ లో ఈ-పహాణీని 11 కాలమ్ లతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వీటిలో భూ యాజమాని పేరుతో పాటు భూ ఖాతా, సర్వే నెంబర్, అనుభవదారు లేదా పట్టాదారు, ప్రభుత్వ భూమి లేదా పట్టా భూమి, వారసత్వంగా వచ్చిందా, కొనుగోలు ద్వారా వచ్చిందా తదితర వివరాలు తెలిపేలా పహాణీ ఉండనుంది.

 

భూ భారతి పోర్టల్ లోగో ను కూడా రెవెన్యూ శాఖ సిద్ధంచేసినట్లు తెలుస్తోంది. వృత్తంలో తెలంగాణ అధికారిక చిహ్నాలు, లోపల సాగును ప్రతిబింబించేలా ఆకుపచ్చని రంగుతో లోగో ఉండనున్నట్లు సమాచారం. వృత్తంపై భూముల నిర్వహణకు సంబంధించిన చట్టం వివరాలను పొందుపర్చినట్లు తెలుస్తోంది. అయితే, కొత్త చట్టం, భూ భారతి లోగోను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉన్నతాధికారులు, నిపుణులు సమావేశమై చర్చించనున్నారు.

Also Read: Inter Result 2025: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల ఆరోజే.. ఏర్పాట్లు చేస్తున్న ఇంటర్ బోర్డు