Private Hospitals Licence : మరో 6 ఆసుపత్రులపై వేటు

అధిక ఫీజులతో కరోనా రోగులను పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ చేసింది. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై మరోసారి కొరడా ఝళిపించింది. తాజాగా మరో 6 ఆసుపత్రులపై చర్యలు తీసుకుంది.

Private Hospitals Licence Revoke : అధిక ఫీజులతో కరోనా రోగులను పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ చేసింది. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై మరోసారి కొరడా ఝళిపించింది. తాజాగా మరో 6 ఆసుపత్రులపై చర్యలు తీసుకుంది. ఆరు ఆసుపత్రుల కొవిడ్ లైసెన్స్ లు రద్దు చేసింది. అంటే ఇకపై ఆ హాస్పిటల్స్ లో కొత్తగా కొవిడ్ రోగులను చేర్చుకోకూడదు, వారికి ట్రీట్ మెంట్ చెయ్యకూడదు. ప్రస్తుతం అడ్మిషన్ లో ఉన్నవారికి మాత్రమే చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది.

కూకట్ పల్లి పద్మజ ఆసుపత్రి, అల్వాల్ లైఫ్ లైన్ మెడిక్యూర్ ఆసుపత్రుల కొవిడ్ లైసెన్స్ రద్దు చేసింది. ఇక ఉప్పల్ లోని టీఎక్స్ ఆసుపత్రిపైనా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది. వరంగల్ లోని మ్యాక్స్ కేర్, లలిత ఆసుపత్రులపైనా యాక్షన్ తీసుకుంది. అలాగే సంగారెడ్డిలో శ్రీసాయిరామ్ ఆసుపత్రి కొవిడ్ లైసెన్స్ లను రద్దు చేసింది.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 16 ఆసుపత్రులపై చర్యలు తీసుకుంది. 105 ఆసుపత్రులపై మొత్తం 106 ఫిర్యాదులు అందినట్లు చెప్పిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ.. 105 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులు అందిన తర్వాత 24గంటల్లోపు సరైన వివరణ ఇవ్వాలని లేని పక్షంలో లైసెన్స్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఇప్పటివరకు 16 ఆసుపత్రుల లైసెన్స్ లు రద్దు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ ఎప్పట్లాగే కొనసాగుతోంది. లైసెన్సులు రద్దు చేసి నోటీసులు ఇచ్చినా కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం తమ తీరుని మార్చుకోవడం లేదు. కొవిడ్ ట్రీట్ మెంట్ పేరుతో సన్ రిడ్జ్ ఆసుపత్రి ఓ రోగికి 18లక్షలు బిల్లు వేసింది. 15 రోజుల క్రితం కొవిడ్ పాజిటివ్ తో ఆసుపత్రిలో చేరిన శ్రీనివాస్ ని అందినకాడికి దోచుకుంది. ఆరోగ్యం నిలకడగానే ఉంది, వైద్యానికి సహకరిస్తున్నాడని ఇప్పటివరకు చెప్పిన ఆసుపత్రి వర్గాలు ఉన్నట్టుండి రోగి చనిపోయాడంటూ చావుకబురు చల్లగా చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు