రూ.50 కోట్ల బ్లాక్‌మననీని వైట్‌గా మార్చాలని కోరిన అధికారి ఎవరు? కోరింది ఎవరిని? అధికారులపై సర్కార్ నిఘా?

కాంట్రవర్సీలకు దూరంగా ఉండాల్సిన అధికారులు.. దందాలు చేస్తూ కలెక్షన్ కింగ్‌లుగా మారిపోవడం అయితే విమర్శలకు దారితీస్తోంది.

Telangana Secretariat

Telangana IAS officers: సీఎంలు, మంత్రులు వస్తుంటారు. పోతుంటారు. కానీ మేము పర్మనెంట్ అంటున్నారట కాంగ్రెస్‌ సర్కార్‌లోని కొందరు కీలక అధికారులు. ఇలా అనడం వరకూ ఓకే..కానీ నేనే రాజు…నేనే మంత్రి అంటూ సర్వం తామే అని రెచ్చిపోతున్నారట కొందరు అధికారులు. తాము ఎంత చెప్తే అంత..తాము అనుకున్నదే రాజ్యం అన్నట్లుగా దొరికినకాడికి దండుకుంటున్నారట.

ప్రజా సమస్యలు ఎన్నో ఉండి.. పెండింగ్‌ ఉన్న ఫైల్స్ సాల్వ్ చేయాలని సీఎం, మంత్రులు ఆదేశించినా లైట్ తీసుకుంటున్న ఆఫీసర్లు కాస్త..తమకు నచ్చితే..తాము అనుకుంటే చకచకా ఫైల్‌ను కదలిస్తున్నారట. ఈ క్రమంలో కీలక శాఖల డిపార్ట్మెంట్లకు హెడ్లుగా ఉన్న పలువురు అధికారులు కలెక్షన్ కింగ్లుగా మారిపోయారట. ఎంతొస్తే అంత అన్నట్లుగా..కాసుల వెంట పరిగెడుతున్నారట. ఈ విషయం సర్కార్ పెద్దల చెవిలో పడటంతో కీలక శాఖల అధికారులపై నిఘా పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read: ఆ 10 మంది ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు? సైదులు “కాంగ్రెస్ సర్వే”లో ఏం తేలింది?

ఈ క్రమంలో ఓ ఐఏఎస్ అధికారి సర్కార్ ఇంటెలిజెన్స్‌కు చిక్కిపోయారట. 50 కోట్ల బ్లాక్ మనీ ఉంది..వైట్ మనీగా చేసి ఇస్తే కోటి ఇస్తానంటూ సదరు అధికారి మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఒక్కసారిగా కీలక శాఖలను నిర్వహిస్తున్న పలువురు పెద్దస్థాయి ఆఫీసర్లు అలర్ట్ అయ్యారట. వెంటనే సీఎస్ దగ్గరకు పరుగులు పెట్టుకుంటూ వెళ్లి..సార్ సార్ ఆ 50 కోట్లు అంటూ మాట్లాడింది తాము కాదని అడగకుండానే వివరణ ఇచ్చుకున్నారన్న గుసగుసలు సెక్రటేరియట్లో హాట్ టాపిక్గా మారాయి.

రూ.50 కోట్ల బ్లాక్‌మనీ ఉంది. ఎవరైనా వైట్‌గా మారిస్తే రూ.కోటి ఇస్తా అంటూ ఓ వ్యాపారికి ఓ ఐఏఎస్ అధికారి ఇచ్చిన ఆఫర్ ఇదీ. తెలంగాణ ప్రభుత్వంలో ఓ కీలకశాఖలో అత్యంత కీలక స్థానంలో పని చేస్తున్న సదరు ఐఏఎస్అధికారి, ఆ బాధ్యతల్లోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఇంత పెద్ద మొత్తం వెనుకేసుకోవడంపై ఉన్నతస్థాయి అధికారుల్లోనూ చర్చకు దారితీసిందట. అనుమతుల పేరుతో అడ్డగోలుగా వసూళ్లకు దిగారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆ అధికారిపై నిఘా పెట్టిందట.

రూ.3 కోట్ల ప్యాకేజీ తీసుకుని పర్మిషన్స్

అనుమతుల కోసం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇటీవల ఆ అధికారిని సంప్రదించగా రూ.3 కోట్ల ప్యాకేజీ తీసుకుని పర్మిషన్స్ ఇచ్చారనే వార్త సంచలనం రేపుతోంది. ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారికైతే అనుమతులు ఇచ్చారో..ఆ వ్యాపారితోనే తన దగ్గరున్న రూ.50 కోట్లను బ్లాక్మనీగా మార్చుమని కోరారట. అందుకు రూ. కోటి ఇస్తానని కూడా ఆఫర్చేసినట్లు..ఆ నోటా ఈ నోటా బయటపడి అధికార వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. ఈ క్రమంలో గత నాలుగు నెలల్లో ఇచ్చిన అన్ని రకాల అనుమతుల్లో ఆయన సొంత ఖాతాలో ఉన్నవి ఎన్ని.? ఇతర మార్గాల ద్వారా…రికమెండేషన్ల ద్వారా అనుమతులు ఇచ్చినవి ఎన్ని.? అనే కోణంలో ప్రభుత్వం లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్య పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల తీరు కాంట్రవర్సీకి దారి తీస్తోంది. అధికార పార్టీ పెద్దలను మన్ననలను పొందేందుకు కొందరు అత్యుత్సాహం చూపిస్తుంటే మరికొందరు మాత్రం..సీఎం, మంత్రులు జాన్తా నై అంతా నా ఇష్టం అన్నట్లుగా బిహేవ్ చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఇదే క్రమంలో హైదరాబాద్ నడిబొడ్డున తిష్ట వేసిన పలువురు కీలక శాఖల అధికారులు మాత్రం ఏకంగా గల్లా పెట్టెలు ఓపెన్ చేసి పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. పని ఏదైనా..ఫైల్ మరేదైనా చేయి తడిపితే తప్పా సంతకం అవ్వడం లేదట.

అయితే అధికార పార్టీ పెద్దలు చెప్పినా కాని పనులు ఆ అధికారులు అనుకుంటే ఇట్టే అయిపోతున్నాయట. ఇదేంటని ఆరా తీసిన ప్రభుత్వ పెద్దలకు షాకింగ్ విషయాలు తెలిశాయట. తెరవెనుక దందా ఏంటో తెలుసుకునేందుకు ఏకంగా సర్కార్ పెద్దలు నిఘా పెట్టగా..పలువురు ఐఏఎస్ అధికారుల సీక్రెట్ మీటింగ్స్..సెటిల్మెంట్స్..అన్నీ వెలుగులోకి వచ్చాయట. ఈ క్రమంలోనే రూ.50 కోట్లు బ్లాక్మనీ డీల్ మాట్లాడిన ఆఫీసర్ ఉందంతం బయటపడిందంటున్నారు.

కాంట్రవర్సీలకు దూరంగా ఉండాల్సిన అధికారులు.. దందాలు చేస్తూ కలెక్షన్ కింగ్‌లుగా మారిపోవడం అయితే విమర్శలకు దారితీస్తోంది. సదరు అధికారిపై త్వరలోనే వేటు వేసేందుకు సర్కార్‌ రెడీ అవుతోందట. సదరు అధికారిని కీలక శాఖ నుంచి తప్పించడంతో పాటు…మరో ఒకరిద్దరు వసూల్ రాజాలను కూడా పక్కన పెట్టేందుకు ఫైల్‌ ప్రిపేర్ అవుతుందనే టాక్ సచివాలయంలో నడుస్తోంది. ఇటీవల వివాదాస్పదంగా మారిన మరో ఐఎఎస్‌ దందాలపై కూడా ఇంటలిజెన్స్‌ దృష్టి పెట్టగా ఆయన భాగోతాలు కూడా దొరికిపోయాయట. ఇంతకీ ఆ వసూలు రాజాలెవరు…వారిని వెనుకేసుకొస్తున్న పెద్దలెవరు అన్నది బయటకు వస్తుందో..లోలోపలే సద్దు మనుగుతుందో చూడాలి మరి.