Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్లకు అప్లయ్ చేశారా.. వారంలో ఆ ప్రక్రియ పూర్తి.. డబ్బులు రావాలంటే ఇలా చేయాల్సిందే..

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు ప్రభుత్వం నిబంధనల ప్రకారం మాత్రమే ఇంటిని నిర్మాణం చేయాలి. ముందుగా ఎంపిక చేసిన స్థలంలో కాకుండా వేరే ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి అనుమతి ఉండదు.

Indiramma Illu

Indiramma Illu: తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వాటిని వేర్వేరుగానే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారుల నుంచి ఇప్పటికే అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం వారిలో అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. అయితే.. లబ్ధిదారుల అకౌంట్లలో దశల వారీగా ప్రభుత్వం నగదు జమ చేయనుంది.

Also Read: Rythu Bharosa: రైతులకు శభవార్త.. వారందరికీ ఇవాళ ‘రైతు భరోసా’ నిధులు వచ్చేస్తున్నాయ్.. మీ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోండి..

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఒక ఎకరా సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.6వేలు చొప్పున జమ చేసింది. ఇవాళ లేదా రేపటి నుంచి రెండు ఎకరాలు సాగుభూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుంది. అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారుల ఖాతాల్లోనూ ప్రభుత్వం నిధులు జమ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జనవరి 26న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి దశలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను కుటుంబ సర్వే, యాప్ సర్వే ఆధారంగా విభజించారు. ఈ విభజన ప్రకారం.. తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి (ఎల్-1) ఇళ్లు అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా  ఎల్-1 నుంచి అత్యధికంగా 59,807 మందిని ఎంపిక చేయగా.. ఎల్-2, ఎల్-3 జాబితాలు, కొత్తగా వచ్చిన దరఖాస్తు దారులు కలిపి మొత్తం 11,675 మందిని ఎంపిక చేశారు. దీంతో తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 71,482 ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read: Chiranjeevi : నాటి ప్రజారాజ్యం పార్టీ నేడు జనసేనగా రూపాంతరం చెందింది- చిరంజీవి హాట్ కామెంట్స్

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు ప్రభుత్వం నిబంధనల ప్రకారం మాత్రమే ఇంటిని నిర్మాణం చేయాలి. దీంతో లబ్ధిదారుల తుది జాబితా ప్రకటించిన తరువాత గ్రామాల్లో ప్రీ -గ్రౌండింగ్ సమావేశాలు ఏర్పాటుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ సమావేశాల్లో లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటిని ఎలా నిర్మించుకోవాలి..? నిర్మాణ సామాగ్రి సరఫరా.. ఇతర అనుమానాలను ఇందులో నివృత్తి చేయనున్నారు.

ఇందిరమ్మ యాప్ సర్వే సమయంలో సొంత స్థలం చూపిన ప్రాంతంలో లబ్ధిదారుడే ముగ్గు పోసుకోవాల్సి ఉంటుంది. మరోచోట కట్టుకుంటానంటే ఆ ఇంటిని అధికారులు రద్దు చేస్తారు. అదేవిధంగా ముగ్గు పోసిన తరువాత గ్రామ కార్యదర్శికి సమాచారం అందిస్తే క్షేత్ర స్థాయికి వచ్చి ఫొటోలు తీసి ఆన్ లైన్ లో నమోదు చేస్తారు. నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు. కనీసం 400 చదరపు అడుగులు కంటే తక్కువ కాకుండా ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సమయంలో ప్రభుత్వం నాలుగు దశల్లో నగదును అందించనుంది. అయితే, ముగ్గుపోసే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందదు. కేవలం పునాది పూర్తయిన తరువాతనే మొదటి విడతలో భాగంగా రూ. లక్ష లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ప్రతి ఇంటికి ఎనిమిది ట్రాక్టర్ల ఇసుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. అందుకు సంబంధించిన కూపన్లు తహసీల్దార్ లేదా ఆర్డీవో ద్వారా అందించనున్నారు.

 

సిమెంటు, స్టీలు వంటి సామాగ్రిని హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తక్కువ ధరకు అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఈ లేదా ఎంపీడీవోలు ఇంటి నిర్మాణం ప్రదేశంలో పరిశీలన చేసి ఇంటి నిర్మాణం పూర్తయిన దశను బట్టి లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేస్తారు. మరో వారం రోజుల్లో ప్రీ-గ్రౌండింగ్ ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు. అయితే, ఎక్కువ శాతం నియోజకవర్గాల్లో ఈ పథకం కింద వెయ్యిలోపే లబ్ధిదారులను ఎంపిక చేశారు. 21 నియోజకవర్గాల్లో వెయ్యికిపైగా లబ్ధిదారులకు ప్రభుత్వం తొలి విడతలో ఇళ్లను అందించనుంది.