TG MLC Oath Taking 2026 : తొలగిన అడ్డంకి.. ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్
TG MLC Oath Taking 2026 : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ లు ప్రమాణ స్వీకారం చేశారు.
telangana kodandaram and azharuddin take oath as mlcs
TG MLC Oath Taking 2026 : తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశంలో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఎట్టకేలకు నేడు ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ లు ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. గవర్నర్ కోటాలో.. అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరామ్లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి నియామకానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. దీంతో గవర్నర్ ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మంత్రి అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఎమ్మెల్సీగా ప్రతిపాదించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి, పీసీసీకి, మంత్రి మండలికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ సర్కార్ మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం తాను మరింత కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.. ‘‘రాజకీయాల్లో, జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. అన్నింటినీ అధిగమిస్తూ ముందుకు వెళ్లాలి. జూబ్లీహిల్స్లో ముస్లింల ఓట్ల కోసమే నాకు మంత్రి పదవి ఇచ్చారనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. సీఎం రేవంత్రెడ్డి మొదట్నుంచీ మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నారు’’ అని తెలిపారు.
