×
Ad

Konda Surekha : నాగార్జున ఫ్యామిలీపై మరోసారి స్పందించిన మంత్రి కొండా సురేఖ.. పరువు తీయాలని కాదు అంటూ..

Konda Surekha : తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశిస్తూ ట్విటర్ వేదికగా సంచలన పోస్టు పెట్టారు.

Konda Surekha

Konda Surekha : తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశిస్తూ ట్విటర్ వేదికగా సంచలన పోస్టు పెట్టారు. కొద్దిరోజుల క్రితం మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేసిన సందర్భంలో నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కొండా వ్యాఖ్యలపై సినీహీరో నాగార్జున సీరియస్ అయ్యారు. తన కుటుంబ గౌరవాన్ని కించపర్చేలా ఆమె వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ.. సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా.. మంత్రి కొండా సురేఖ ట్విటర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.

మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత అంటే.. 12గంటల సమయంలో కొండా సురేఖ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టారు. ఈ పోస్టులో నాగార్జున కుటుంబం విషయంలో నేనే చేసిన ప్రకటనలలో ఏదైనా అనుకోని పొరపాటు జరిగిఉంటే దానికి చింతిస్తున్నాను.. ఆపై ఆ వ్యాఖ్యలను నేను ఉపసంహరించుకుంటున్నానను అని కొండా సురేఖ పేర్కొన్నారు.

సురేఖ పోస్టు ప్రకారం.. ‘నాగార్జునకు సంబంధించి నేను చేసిన వ్యాఖ్యలు ఆయనతో పాటు తన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశంతో చేయలేదని స్పష్టంగా తెలుపుతున్నాను. అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులను బాధపెట్టాలని లేదా పరువు తీయాలని నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. వారి కుటుంబ విషయంలో నేను చేసిన ప్రకటనలలో ఏదైనా అనుకోని పొరపాటు జరిగి ఉంటే దానికి చింతిస్తున్నాను. ఆపై ఆ వ్యాఖ్యలను నేను ఉపసంహరించుకుంటున్నాను’’ అంటూ మంత్రి కొండా సురేఖ తన పెట్టిన పోస్టులో పేర్కొన్నారు.

ఇటీవల వరుస రాజకీయ వివాదాల్లో చిక్కుకుంటూ కొండా సురేఖ, ఆమె ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున కుటుంబంపై గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఇటీవల పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపింది. అదే సమయంలో కొండా సురేఖ కుమార్తె సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలోని కొందరు మంత్రులు, రెడ్డి సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ సమయంలో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తారన్న చర్చకూడా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరిగింది. అయితే, సీఎం రేవంత్ రెడ్డితో ఆమె భేటీ తరువాత వివాదం సర్దుమణిగింది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు నాగార్జున విషయంలో ప్రస్తుతం ఆమె ఇలా రియాక్ట్ అయ్యారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి కొండా సురేఖ తాజాగా చేసిన పోస్టుతో ఈ అంశానికి తెరపడుతుందో..? లేదో..? వేచి చూడాల్సిందే.