పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్ట్‌పై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు.. టెండర్‌, సర్వే నిలిపివేయాల్సిందేనంటూ..

నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటూ లేఖలో ప్రస్తావించింది.

పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్ట్‌పై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు.. టెండర్‌, సర్వే నిలిపివేయాల్సిందేనంటూ..

Updated On : October 14, 2025 / 10:31 PM IST

Banakacharla: పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్ట్‌పై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ఏపీ కొత్త టెండర్‌ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని సీడబ్ల్యూసీకి తెలంగాణ లేఖ రాసింది. ఏపీ కొత్త టెండర్‌ నోటిఫికేషన్‌పై తెలంగాణ సర్కార్‌ తీవ్ర అభ్యంతరం చెప్పింది.

బనకచర్ల టెండర్‌, సర్వే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి చేసింది. పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్ట్‌ను ఆమోదించవద్దని కోరింది. పోలవరం డీపీఆర్‌కు విరుద్ధంగా కొత్త టెండర్‌ ఉందని తెలంగాణ ఆరోపించింది.

పోలవరం-బనకచర్లను అడ్డుకోవాలంటూ సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA)కి తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ లేక రాసింది. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటూ లేఖలో ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం మొండిగా డీపీఆర్ ల కోసం టెండర్లు పిలవడాన్ని ప్రస్తావించింది.

నీటి వాటాల్లో తెలంగాణ హక్కుల కోసం పోరాటం: ఉత్తమ్
నీటి వాటాల్లో తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “కర్ణాటకలో కాంగ్రెస్, మహారాష్ట్రలో బీజేపీ, ఏపీలో టీడీపీ ఉన్నా మా హక్కులను వదులుకోం. బనకచర్ల, ఆల్మట్టిపై మేము నిబంధనల ప్రకారం ఫైట్ చేస్తున్నాం.

కృష్ణా, గోదావరిలో నీటి వాటాల కోసం ప్రభుత్వం కమిట్మెంట్ తో పనిచేస్తోంది. త్వరలోనే మహారాష్ట్ర వెళ్తున్నాం. కేసీఆర్ పదేళ్లలో చేసింది ఏమీలేదు…కాళేశ్వరం పేరుతో మిగతా ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కాళేశ్వరం నీళ్లు లేకున్నా.. భారత దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పంటలు పండాయి. ధాన్యం కొనుగోలు కోసం 25 వేల కోట్లు రైతులకు కేటాయిస్తున్నాం. నా శాఖ, నా జిల్లా అభివృద్ధి పనులపై నేను ఫోకస్ పెట్టాను. మంత్రుల మధ్య సమన్వయం ఉంది. విభేదాలు లేవు. ఇరిగేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు అవాస్తవం” అని అన్నారు.