Telangana Corona Case List : తెలంగాణలో కొత్తగా 12 కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 10వేల 348 కరోనా పరీక్షలు నిర్వహించగా, 12 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Corona Case List)

Telangana Covid Report

Telangana Corona Case List : తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 10వేల 348 కరోనా పరీక్షలు నిర్వహించగా, 12 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ జిల్లాలో 8 కేసులు వచ్చాయి. ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో చెరో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. గడిచిన 24 గంటల్లో మరో 49 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. రాష్ట్రంలో ఇంకా 290 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. నేటివరకు రాష్ట్రంలో 7,91,328 కరోనా కేసులు నమోదవగా.. 7,86,927 మంది కోలుకున్నారు. క్రితం రోజు రాష్ట్రంలో 10వేల 823 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 7 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

Corona 4th Wave : కరోనా కొత్త వేరియంట్ ఎక్స్‌ఈ వేగంగా వ్యాపిస్తుంది- WHO

అటు దేశంలో కరోనా మహమ్మారి పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తోంది. కొన్ని రోజులుగా 1500లోపే నమోదవుతున్న కొత్త కేసులు.. తాజాగా వెయ్యికి చేరువకు దిగిరావడం భారీ ఊరట కలిగిస్తోంది. ఇక మరణాలు కూడా వందలోపే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,65,904 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1096 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 81 మంది కోవిడ్ తో మరణించారు. దేశంలో నేటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5,21,345కు చేరింది.(Telangana Corona Case List)

తాజాగా 1,447 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.24 కోట్లు దాటింది. రికవరీలు ఎక్కువగా ఉంటుండంతో.. యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 13,013 (0.03%)కు తగ్గాయి. కరోనా కట్టడి కోసం కేంద్రం ప్రారంభించిన వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 12,75,495 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 184.66 కోట్లు దాటింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉధృతి తగ్గినప్పటికీ కొత్త వేరియంట్లు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొత్త వేరియంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూనే ఉంది. ఈ క్రమంలో మ్యుటేషన్‌ కారణంగా కొత్తగా పుట్టుకొస్తున్న హైబ్రిడ్‌ వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని మరోసారి సూచించింది. ఇప్పటివరకు XD, XE, XF అనే మూడు హైబ్రిడ్‌ రకాలను గుర్తించినట్లు తెలిపిన ప్రపంచ ఆరోగ్యసంస్థ.. ఎక్స్‌ఈ స్ట్రెయిన్‌ (ఒమిక్రాన్‌ రెండు వేరియంట్ల ఉపరకమైన హైబ్రిడ్‌ స్ట్రెయిన్‌)లో 10శాతం పెరుగుదల రేటు అధికంగా ఉన్నట్లు వెల్లడించింది.

కొత్తగా బయట పడిన కరోనా మ్యుటెంట్ ‘ఎక్స్ఈ’కి మరింత వేగంగా వ్యాపించే గుణం ఉందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. కరోనా ఒమిక్రాన్ లో ఉప రకమైన బీఏ.2 (స్టెల్త్ కరోనా)ను ఇప్పటి వరకు అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్ గా పరిగణిస్తున్నారు. కానీ, దీంతో పోలిస్తే ఎక్స్ఈ రకానికి 10 శాతం ఎక్కువ వేగంతో విస్తరించే లక్షణం ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

Face Mask: మాస్కులు ఆప్షనల్.. మహారాష్ట్రతో పాటు ఢిల్లీ, బెంగాల్ కూడా

ఇప్పటికీ ఒమిక్రాన్ ఉపకరం బీఏ.2 పలు దేశాల్లో విస్తరిస్తూనే ఉంది. అమెరికాలో కొత్తగా వెలుగు చూస్తున్న కేసుల్లో అత్యధికం ఈ రకానివే ఉంటున్నాయి. ఎక్స్ఈ అన్నది రెండు రకాల హైబ్రిడ్ వెర్షన్. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 కలసిన రూపం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ఈ కేసులు చాలా స్పల్ప స్థాయిలోనే ఉన్నాయి. ఎక్స్ఈ రకాన్ని మొదటిసారిగా 2022 జనవరి 19న బ్రిటన్ లో గుర్తించారు.

యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అధ్యయనం ప్రకారం.. మూడు రకాల రీకాంబినెంట్ స్ట్రెయిన్లు ఎక్స్ డీ, ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్ ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నాయి. గతంలో వెలుగు చూసిన రెండు ఉప రకాలతో కలసిన స్వరూపాన్ని రీకాంబినెంట్ గా చెబుతారు. ఇందులో ఎక్స్ డీ అన్నది.. డెల్టా, బీఏ.1 కలసిన రకం. ఎక్స్ఎఫ్ అన్నది డెల్టా, బీఏ.1 కలసిన మరొక రూపం.