Prof. Lakshmi Srinivas Yedavalli
ములుగులోని సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ మొట్టమొదటి వీసీగా లక్ష్మీ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మక్క సారలమ్మ సెంట్రల్ వర్సిటీ వీసీగా ఆయన ఐదేళ్ల పాటు కొనసాగుతారు.
డాక్టర్ వై.ఎల్. శ్రీనివాస్ ఇంగ్లిష్ ప్రొఫెసర్. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అరోరా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అకాడమీ (అరోరా యూనివర్సిటీ)లో ప్రొ వైస్ చాన్సలర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వై.ఎల్. శ్రీనివాస్ 1992లో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరారు. 2017 వరకు హైదరాబాద్ కోఠిలోని యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో పని చేశారు.
అనంతరం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ (ఓయూ)కు బదిలీ అయ్యారు. 2019 నుంచి 2021 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లిష్ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఆ తర్వాత ఇంగ్లిష్ విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. 2021 డిసెంబర్లో ఇఫ్లూ (ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ)లో చేరారు.
Also Read: తెలంగాణ బడ్జెట్ సమావేశాల వేళ ట్రాఫిక్ ఆంక్షలు
స్కూల్ ఆఫ్ లిటరరీ స్టడీస్ ఇంగ్లిష్ లిటరేచర్ విభాగంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఇంగ్లిష్ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం, మహబూబ్ నగర్ పాలమూరు విశ్వవిద్యాలయం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.
సాహిత్యం, ఇంగ్లిష్‌లో భారతీయ రచనలు, ఫిల్మ్ అండ్ మీడియా స్టడీస్, ఇంగ్లిష్ భాష బోధన తదితర అంశాలపై పరిశోధనలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో.. ఆయన రాసిన 34కు పైగా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఆయన రాసిన 10 పాఠ్యపుస్తకాలను కేంబ్రిడ్జ్, మెక్ మిలన్, ఓరియంట్ బ్లాక్ స్వాన్ వంటి ప్రచురణ సంస్థలు ప్రచురించాయి.
ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్ సంపాదకత్వంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మూడు కోర్సు పుస్తకాలు, ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి ఒక పుస్తకం వెలువడ్డాయి. ఇప్పటి వరకు 8 మంది స్కాలర్లకు పీహెచ్ ప్రోగ్రాంలకు గైడ్‌గా వ్యవహరించారు. ఆయన మార్గదర్శకత్వంలో ఇప్పటికే మరో ఇద్దరు స్కాలర్లు తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. మరో ముగ్గురు స్కాలర్లు తమ పరిశోధనలను కొనసాగిస్తున్నారు.