Traffic Restrictions: తెలంగాణ బడ్జెట్ సమావేశాల వేళ ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం వివరించనుంది.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల దృష్ట్యా హైదరాబాద్‌లోని నాంపల్లిలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తెలంగాణ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలకు పోలీసులు అనుమతిని నిరాకరించారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతుండగా, ఈ నెల 19న బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇవాళ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం ఉంటుంది. సుమారు గంటపాటు గవర్నర్ ప్రసంగం ఉండే అవకాశం ఉంది.
రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సభలో సభ్యులు మాట్లాడతారు. ఈ నెల 14న హోలీ సందర్భంగా సెలవు ఉంటుంది. ఈ నెల 15వ తేదీన ధన్యవాద తీర్మానం ఉంటుంది. అనంతరం 16వ తేదీన ఆదివారం సెలవు.
Also Read: ఇలాగైతే కొత్త బ్యాటర్లు టీమిండియాలోకి రావడం కష్టం: షేన్ వాట్సన్
ఈ నెల 17న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై చర్చ జరుపుతారు. 18న బీసీ కులగణన, రిజర్వేషన్లపై చర్చ ఉంటుంది. 19న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ నెల 27వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి.
తెలంగాణలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం వివరించనుంది. కాంగ్రెస్ సర్కారు పాలనా వైఫల్యాలపై నిలదీస్తామని బీఆర్ఎస్, బీజేపీ అంటున్నాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటారు. బీఏసీలో నిర్ణయం తర్వాత అధికారికంగా ఈ తేదీలను ప్రకటించనున్నారు.
పలు బిల్లలకు ఈ సమావేశాల్లో తెలంగాణ సర్కారు ఆమోదముద్ర వేయనుంది. స్థానిక సంస్థల్లో, విద్య ఉద్యోగావకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చెందిన పలు బిల్లులకు ఆమోద ముద్ర వేయనున్నారు.