SSC Exams
TS SSC Exams : తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన వెలువడింది. పాఠశాల విద్యాశాఖ తాజాగా సమాచారం ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 18 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించిన పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే అదే తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.
మరోవైపు సరిగ్గా మార్చి 18వ తేదీనే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు కూడా ముగియనున్నాయి. ఇక టెన్త్ పరీక్షలు ప్రారంభమైన వెంటనే మధ్యలో శ్రీరామనవమి పండగ వస్తోంది. దీంతో మార్చి 26, 27 ఏదైనా ఒక తేదీలో శ్రీరామనవమి సెలవు రానుంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం సెలవుల జీవోను విడుదల చేస్తేగాని ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు నేడో, రేపో పదో తరగతి పరీక్షల పూర్తి షె డ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటికే పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయి. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 13వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో పరీక్ష ఫీజుల చెల్లింపు గడువును కూడా మరో 10రోజులు పొడిగించాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్మామాస్టర్స్ అసోసియేషన్ (టీజీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది.