తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి.. ఇలా అభివృద్ధి..

Telangana Turns 10: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియ ఓ వైపు జోరుగా కొనసాగుతుండగా..

తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి.. ఇలా అభివృద్ధి..

Updated On : May 31, 2024 / 9:28 PM IST

తెలంగాణ అంటే ఓ పోరాటం… తెలంగాణ అంటే ఆత్మ విశ్వాసం.. ఆకలినైనా భరిస్తాం కానీ, అవమానాల్ని సహించం అన్న ఒకే ఒక్క మాట యావత్‌ తెలంగాణను ఐక్యం చేసింది. అప్పటికీ.. ఇప్పటికీ… తెలంగాణ సమాజంలో అదే పిలుపు.. అదే చైతన్యం కనిపిస్తోంది. అందుకే దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణది ప్రత్యేక చరిత్ర.

పోరాటం ద్వారా సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని తన సొంత ఆస్తిగా భావిస్తారు ఇక్కడి పౌరులు.. ప్రత్యేక రాష్ట్రం సాధించినా ఆ చైతన్యాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ తమకు నచ్చిన పాలనను… తాము మెచ్చిన విధానాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి చేస్తుంటారు…

తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు అయినా… ఇప్పటికీ ఆ ఉద్యమ సంకల్పం… అప్పటి చైతన్యం మాత్రం ఇక్కడి ప్రజలను వీడలేదు. ఒకవైపు ప్రగతి వైపు పరుగులు తీస్తూనే… అప్పటి ఉద్యమ స్ఫూర్తి కొనసాగిస్తున్నారు తెలంగాణ వాసులు.

తమ అభీష్టానికి వ్యతిరేకంగా వెలువడే ఏ విధానాన్ని అయినా ప్రతిఘటించడంలో ప్రజలంతా ఒక్కటిగా నిలుస్తుండటం కనిపిస్తోంది.. తెలంగాణ రక్తంలో కలిసిపోయిన ఈ పోరాట పంథా తొలి, మలిదశల్లో ఏ విధంగా సమాజాన్ని చైతన్యవంతం చేసిందో ఇప్పటికీ అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ తమకు కావాల్సిన అభివృద్ధిని సాధించుకుంటోంది.

2013 డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రకటన విడుదలైనంతవరకు సాగిన ఓ సుదీర్ఘ పోరాటం నూతన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా చెప్పొచ్చు. అందుకే ఇప్పటికీ తెలంగాణ ఉద్యమకారులకు తగిన గౌరవమిస్తోంది ప్రభుత్వం.

ముఖ్యంగా మలిదశ ఉద్యమంలో హైదరాబాద్‌ పాత్ర చాలా కీలకం. 2009 నవంబర్‌ 9న ఎల్‌బీ నగర్‌ చౌరస్తాలో శ్రీకాంతాచారి బలిదానంతో ఉద్యమం మరింత పుంజుకుంది. ఉస్మానియా విద్యార్థుల మహాగర్జన, 2011 మార్చిలో చేపట్టిన మిలియన్‌ మార్చ్‌, అదే ఏడాది సెప్టెంబర్‌లో చేపట్టిన సకల జనుల సమ్మె తెలంగాణ సాధనకు దోహదపడ్డాయి.

ఇలా ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు ప్రగతి పరుగులు తీస్తోంది. దేశంలోనే ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహం, సరికొత్త సచివాలయం, అమరవీరుల స్థూపం వంటి ఐకానిక్‌ భవనాలు సుందర తెలంగాణను ఆవిష్కరిస్తున్నాయి. విద్యుత్‌ కొరతను అధిగమించడంతోపాటు నీటి సమస్యను పరిష్కరించుకున్న తెలంగాణ… నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కొంతవరకు సక్సెస్‌ అయింది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియ ఓ వైపు జోరుగా కొనసాగుతుండగా, ప్రైవేటు రంగంలో ముఖ్యంగా ఐటీ, ఫార్మా రంగాల్లో ఉపాధి అవకాశాలు గతం కంటే మెరుగయ్యాయి. ఇక తెలంగాణకే వన్నె తెచ్చిన రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌ ఈ పదేళ్లలో విశ్వనగరంగా ఎదిగింది.

హైదరాబాద్ ఇలా..
తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదేళ్లలో హైదరాబాద్ నగరం రూపురేఖలే మారిపోయాయి. ప్రత్యేక రాష్ట్రంలో అనుసరించిన విధానాలతో హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదిగింది. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. అంతకుముందెన్నడూ చూడని రహదారులు, ఫ్లై ఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.

ఇక నగరవాసులకు ప్రయాణ భారాన్ని తగ్గించిన మెట్రో… హైదరాబాద్ అభివృద్ధిలో చాలా కీలకమైంది.. నగరానికి మణిహారంగా మారింది. పెట్టుబడులకు చిరునామాగా మారిన తెలంగాణలో టీ హబ్‌తో ఇతర భవనాలు రాష్ట్రాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేస్తున్నాయి. అదేవిధంగా 10 జిల్లాల తెలంగాణ 33 కొత్త జిల్లాలు, నూతన మండలాలు, కొత్త పంచాయితీలు ఇలా సమగ్రంగా రూపుమార్చుకుని సరికొత్త శిఖరాలను చేరుకునేలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

Also Read: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం.. కేసీఆర్ ఏమన్నారంటే..