తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ తొలిసారిగా గురువారం కొలువుదీరనుంది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి(జనవరి 17, 2019)నుంచి ప్రారంభం కానున్నాయి. 20వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం బుధవారం(జనవరి 16, 2019) రాజ్ భవన్ లో ఎంఐఎం పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తో గవర్నర్ నరసింహన్ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేయించారు.
ఇవాళ ఉదయం 11.30గంటలకు ముంతాజ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశమవుతోంది. అంతకుముందు ఉదయం 11గంటలకు గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం దగ్గర సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అమరవీరులకు నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్తారు. 11.05 గంటల నుంచి అసెంబ్లీలో జరిగే కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమానం చేయిస్తారు.
ముందుగా సీఎం కేసీఆర్, తర్వాత మహిళా సభ్యులు ప్రమాణం చేస్తారు. ఎన్నికల కమిసన్ నోటిఫికేషన్ లో పొందుపర్చిన అక్షరమాల ప్రకారం మిగతాసభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. గవర్నర్ నరసింహనన్ శనివారం(జనవరి 19, 2019) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీ, కౌన్సిల్ లో వేర్వేరుగా చర్చ జరుగుతుంది. తర్వాత గవర్నర్ ప్రసంగానికి అసెంబ్లీ, కౌన్సిల్ ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయనున్నాయి.