కులగణనపై తెలంగాణలో రాజకీయ దుమారం.. ఏం జరుగుతోందో తెలుసా?

కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అమలు చేస్తున్న ఈ స్ట్రాటజీ ఎంత వరకు వర్కౌట్ అవుతుంది?

కులగణనపై తెలంగాణలో రాజకీయ దుమారం.. ఏం జరుగుతోందో తెలుసా?

Cm Revanth Reddy

Updated On : February 4, 2025 / 7:46 PM IST

బీసీ రిజర్వేషన్ల రచ్చ తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్ క్రియేట్ చేస్తోంది. అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని, కులాల లెక్కలు తేలుస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ..అందుకు తగ్గట్లుగా కులగణన సర్వే చేసింది. పైగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్.

కానీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీ రిజర్వేషన్ల పెంపు పాజిబుల్‌ అయ్యేలా కనిపించడం లేదు. అయితే సాధ్యమైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటోందట ప్రభుత్వం. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు కార్యాచరణ రూపొందిస్తోందట. అందుకే ఇప్పుడు రిజర్వేషన్స్‌ ఇష్యూ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది.

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతమని తేల్చారు. ముస్లిం మైనార్టీలకు చెందిన బీసీలు 10.08 శాతంగా ఉన్నారని నివేదిక చెబుతోంది. అంటే తెలంగాణలో మొత్తం బీసీల జనాభా 56.33 శాతంగా తేలింది. దీంతో కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్‌ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన సమయం వచ్చింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు.

YS Jagan: జగన్‌ కోసం మళ్లీ రంగంలోకి ఐప్యాక్‌ టీమ్..!

కాంగ్రెస్ ప్రభుత్వం స్ట్రాటజీ
అంటే ప్రస్తుతమున్న 22 శాతం బీసీ రిజర్వేషన్లను పెంచడానికి వీల్లేదు. ఇక్కడే కాంగ్రెస్ ప్రభుత్వం ఓ స్ట్రాటజీని ఫాలో అవుతోందట. బీసీ రిజర్వేషన్లను పెంచుకునేలా పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపించబోతుందట. అప్పుడు బీసీ రిజర్వేషన్ల బాల్ బీజేపీ సర్కార్ కోర్టులోకి వెళ్తుందని, తమ పరిధిలో ఉన్నంత వరకు చేశామని ప్రజలకు చెప్పుకోవచ్చని కాంగ్రెస్ ప్లాన్‌ అని అంటున్నారు.

ఇదే సమయంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ హామీని పార్టీ పరంగా నిలబెట్టుకుంటామంటోంది కాంగ్రెస్. పంచాయితీ ఎన్నికల్లో 42 శాతం సీట్లు డెడికేటెడ్‌గా బీసీలకే ఇచ్చి మాట నిలబెట్టుకుంటామని సీఎంతో సహా మంత్రులు చెబుతున్నారు. మిగతా పార్టీలు కూడా బీసీలకు 42శాతం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది అధికార కాంగ్రెస్.

రేవంత్ సర్కార్ ఆలోచన ఇదేనా?
ఇప్పటికే ఉన్న 22 శాతం రిజర్వేషన్ ప్రకారం ఆ సీట్లు బీసీలకు ఇస్తూనే, జనరల్ స్థానాల నుంచి మరో 20 శాతం సీట్లు బీసీ కోటాలో చేర్చేలా ఆలోచిస్తున్నారట కాంగ్రెస్‌ పెద్దలు. సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యం కాకపోయినా పార్టీ పరంగా ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చామని చెప్పుకోవాలన్నది రేవంత్ సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. తాము బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం..మీ సంగతి ఏంటంటూ బీఆర్ఎస్, బీజేపీపై ఒత్తిడి తెస్తుంది కాంగ్రెస్.

ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని కేంద్రంలో తమ ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు అది సాధ్యం కాదని ప్రజలకు చెప్పాలనుకుంటోందట కాంగ్రెస్‌. తమ పరిధిలో ఉన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని బీసీలకు న్యాయం చేస్తామని చెబుతూ పంచాయితీ ఎన్నికలకు వెళ్లాలనేది కాంగ్రెస్ ప్లాన్.

మరి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అమలు చేస్తున్న ఈ స్ట్రాటజీ ఎంత వరకు వర్కౌట్ అవుతుంది? బీసీలు ఈ అంశాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు.? స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ వైపు జనం మొగ్గుచూపుతారా లేదా అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. రాబోయే రోజుల్లో రిజర్వేషన్ పాలిటిక్స్‌ టర్న్ తీసుకోబోతున్నాయో చూడాలి మరి.