Motkupalli Narasimhulu on CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి వల్ల తన ప్రాణానికి హాని ఉందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ జీవితమే కరప్షన్ అని, ప్రతిపక్షంలో ఉండి కూడా కోట్లు సంపాదించారని అన్నారు. తాను ఎక్కడికి పోనని, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. కుల అహంకారంతో మాదిగలను సీఎం రేవంత్ అనగదొక్కుతున్నారని మండిపడ్డారు. వంద రోజుల పాలనలోనే రేవంత్ ఏంటో అర్థం అయిందని అన్నారు.
”మమ్మల్ని, మా జాతిని ఏడిపిస్తున్నావ్. టార్గెట్‌గా మాదిగలను తొక్కుతున్నావ్. 80 లక్షల మాదిగలను రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నావ్. నీ దయ వల్ల నాకు బీపీ వచ్చింది. నీ వల్ల మా జాతి 50 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. మీ రెడ్డి ఎంపీలు పార్లమెంట్‌కి వెళ్లి ఏం చేస్తారు.. గడ్డి కొస్తారా? దుకాణం ఓపెన్ చేసి డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వారికి టికెట్లు అమ్ముకున్నావ్. నా జాతిని ఐకమత్యం చేయడమే నా భవిష్యత్. ప్రజలు అందరూ ఓటు వేసే ముందు ఆలోచించాలి.
వంద రోజుల్లో రేవంత్ ఏంటో అర్థం అయింది. ఆరు గ్యారెంటీ ఏమయ్యాయి? ఎన్నికల్లో రేవంత్‌ని ఓడించాలని అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిస్తున్నా. తెలంగాణలో ఉన్నది సోనియా, రాహుల్ కాంగ్రెస్ కాదు.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్. రేవంత్ కాంగ్రెస్‌కి ఎవరు ఓటు వేయవద్దు. రేవంత్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలు కాంగ్రెస్‌వి కావు. కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినవే. పేదల పెన్షన్ ఇవ్వలేక పోతున్నావ్. నేను ఎక్కడికి పోను. కాంగ్రెస్ లోనే ఉంటాన”ని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.
Also Read: ఏడాదిలోపు తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. సీఎం రేవంత్ రెడ్డి నా శిష్యుడే: ఎర్రబెల్లి