MLC Elections : ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు కోదండరామ్ మద్దతు, ఒక చోట కాంగ్రెస్ కి..

నిజాయితీగా పని చేసిన వాళ్లకు అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయులను కోరుతున్నా. నిబద్ధత కలిగిన వారిని ఎంపిక చేసుకోవాలి.

MLC Elections : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరామ్. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు, ఒక చోట కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించారు కోదండరామ్.

ఖమ్మం వరంగల్ నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి పల్నాల గోపాల్ రెడ్డికి టీజేఎస్ మద్దతిస్తున్నామని కోదండరామ్ చెప్పారు. ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి వై అశోక్ కుమార్ కి మద్దతిస్తున్నామన్నారు. కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి టీజేఎస్ సపోర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అనేక సమస్యలపై చర్చించి పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు కోదండరామ్.

Also Read : అధికారుల తీరు వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు, వాళ్లే కోవర్టులు, చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది- మధుయాష్కీ సంచలనం

‘రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టింది. నిజాయితీగా పని చేసిన వాళ్లకు అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయులను కోరుతున్నా. నిబద్ధత కలిగిన వారిని ఎంపిక చేసుకోవాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఒక్క సంవత్సరం మాత్రమే అయ్యింది. ఇంకా నాలుగేళ్ళు ఉంది. కాంగ్రెస్ పొత్తు సమయంలో ఇచ్చిన హామీలు తప్పక అడుగుతాం. సమాజానికి ఇచ్చిన హామీలు కూడా అడుగుతాం.

విపరీతమైన అప్పులతో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం పలు పథకాలను సాహసోపేతంగా అమలు చేస్తోంది. రాజలింగమూర్తి తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు పని చేశారు. దాడి చేసి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడి వెనుక ఎవరు ఉన్నా తప్పక శిక్షించాలి.

Also Read : ఎనీ సెంటర్.. నేను రెడీ.. దమ్ముందా..! విపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..

కృష్ణా జలాల విషయంలో పదేళ్లలో నిర్లక్ష్యం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ శత్రుదేశాలు కాదు. ఘర్షణ వాతావరణం లేకుండా చర్చలు జరగాలి. తెలంగాణకి కావలసిన నీళ్లు కేంద్రం ఇవ్వలేదు. హరీశ్ రావు పదేళ్లు మౌనంగా ఉండి ఇవాళ మాట్లాడుతున్నారు. కొట్లాడాల్సిన సిపాయి వాళ్ళతో కలిశారు. కృష్ణా జలాలు సెటిల్డ్ ఇష్యూ కాదు. సెటిల్ మెంట్ కావలసిన ఇష్యూ. రాజ్యాంగం సరిగ్గా తెలియక ముస్లింలను బీసీలలో ఎలా కలుపుతారని కొందరు మాట్లాడుతున్నారు” అని కోదండరామ్ అన్నారు.