ఆ 10మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా..! కాసేపట్లో సుప్రీంకోర్టులో తుది తీర్పు.. తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ..

తెలంగాణలో పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. వారిపై అనర్హత వేటు పడుతుందా.. సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇవ్వనుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Supreme Court

Supreme Court: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. వారిపై అనర్హత వేటు పడుతుందా..? సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇవ్వనుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పార్టీ పిరాయింపుల కేసులో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఇవాళ తేలనుంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.

Also Read: కేవలం రూ.5కే హైదరాబాద్‌లో బ్రేక్ ఫాస్ట్.. పథకం అమలు ఆరోజు నుంచే.. తొలి దశలో 60 క్యాంటీన్లలో..

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై విజయం సాధించి.. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటీషన్ల పై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు సార్లు పిటీషన్లపై విచారణ జరిగింది. చివరిసారిగా ఏప్రిల్ 3న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టైన్ జార్జి మసీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇప్పుడు జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ కేసుపై ఇవాళ సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

2023లో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై విజయం సాధించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ లు కొంతకాలం తరువాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ ను కోరారు. అయినా, స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో.. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.