Congress party : వేటు తప్పదా..! రాజగోపాల్ రెడ్డిపై మల్లు రవి హాట్ కామెంట్స్.. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే..

పార్టీలో నాది ఫైరింజన్ పని.. ఎక్కడైనా మంటలు చెలరేగితే ఆర్పడం నా పని. మంటలు ఆర్పడానికే నేను ఉన్నాను. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వేటు తప్పదు అంటూ ..

Congress party

Congress party: కాంగ్రెస్ పార్టీ (Congress party) నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొద్దిరోజులుగా సొంత పార్టీ నేతలపై హాట్ కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని, నియోజకవర్గానికి నిధులు కూడా మంజూరు చేయడం లేదని ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై టీపీసీసీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిద్ధమైనట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి రాజగోపాల్ రెడ్డి ఇష్క్యూపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Telangana Congress Leaders: తెలంగాణ కాంగ్రెస్‌లో కమ్యూనికేషన్ గ్యాప్..! ఏం జరుగుతోంది?

గాంధీ భవన్ లో ఆదివారం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. మల్లు రవి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గాంధీభవన్‌కు చేరుకున్న మల్లు రవి మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. నాది ఫైరింజన్ పని.. ఎక్కడైనా మంటలు చెలరేగితే ఆర్పడం నా పని. మంటలు ఆర్పడానికే నేను ఉన్నాను.. మంటలు పెంచడం నా ఉద్దేశం కాదు. కానీ, ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వేటు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

వరంగల్ పంచాయితీపై నలుగురిని అక్కడికి పంపాలని నిర్ణయం తీసుకున్నాం. ఇదే విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడికి, మీనాక్షి నటరాజన్ కు సూచించాను. ఎవరెవర్ని పంపాలనేది కాంగ్రెస్ అధిష్టానం సూచిస్తుంది. నేను మంటలు పెట్టడానికి లేను.. చల్లార్చే పనిలో ఉన్నానని మల్లు రవి అన్నారు. రాజగోపాల్ రెడ్డి అంశం పీసీసీ చీఫ్ నాతో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న విషయాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఆయన అంశంపై చర్చిస్తాం. ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని మల్లు రవి అన్నారు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై శనివారం మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటామని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించామని చెప్పారు. ఆయన వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని తెలిపారు.