Traffic Challans : పెండింగ్ చలాన్స్ కు మంచి స్పందన వస్తోందని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు చలాన్స్ క్లియర్ చేసుకునేందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణలో 3 కోట్ల 59 లక్షల చలాన్స్ పెండింగ్ ఉన్నాయని వెల్లడించారు. ఈ రోజువరకు 77 లక్షల చలాన్స్ క్లియర్ అయ్యాయన్నారు. 67 కోట్ల రూపాయలు పెండింగ్ చలాన్ అమౌంట్ కలెక్ట్ అయిందన్నారు. హైదరాబాద్ కమిషనర్ పరిధిలో 18 కోట్లు, సైబరాబాద్ కమిషనర్ పరిధిలో 14 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 7.15 కోట్లు పెండింగ్ చలాన్స్ అమౌంట్ కలెక్ట్ అయిందని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 67 కోట్ల పెండింగ్ చలాన్ అమౌంట్ కలెక్ట్ అయిందని వివరించారు.
ఇక, ట్రాఫిక్ చలాన్ వెబ్ సైట్ లో ఎలాంటి ఇబ్బందులు లేవని ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ చెప్పారు. రెండు ఫేక్ చలాన్ వెబ్ సైట్ల గురించి సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందన్నారు. 6 నెలల క్రితం సైబర్ నేరగాళ్లు వాటిని క్రియేట్ చేశారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అప్పుడే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. భయపడాల్సిన అవసరం లేదని, ఆ నకిలీ వెబ్ సైట్ లో పేమెంట్ గేట్ వేస్ లేవని విశ్వప్రసాద్ చెప్పారు. 6నెలల క్రితం సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ వాళ్లు రెండు నకిలీ వెబ్ సైట్లను బ్లాక్ చేశారని వివరించారు. వానదారులు అందరూ ట్రాఫిక్ రూల్స్ ని పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read : ఏం కష్టం వచ్చింది తల్లీ.. ప్రాణాలు తీసుకున్నావు.. బీటెక్ విద్యార్ధిని బలవన్మరణం..
”రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ చలాన్స్ కి విశేష స్పందన వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 59 లక్షల పెండింగ్ చలాన్స్ ఉన్నాయి. గత నెల 26 నుంచి నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 76 లక్షల 79 వేల చలాన్లకు సంబంధించి 66 కోట్ల 77 లక్షలు చెల్లింపులు జరిగాయి. ఈ నెల 10వ తేదీ వరకు డిస్కౌంట్ తో చలాన్స్ పేమెంట్ కి అవకాశం ఉంది” అని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వ ప్రసాద్ తెలిపారు.
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు చెల్లించేందుకు వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023 డిసెంబర్ 25 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలానాలు ఉన్నాయి. చలాన్లుపై ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ప్రకటించింది. బైకులు, ఆటోలకు 80శాతం.. ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ఇచ్చింది. దీంతో అనూహ్య స్పందన లభిస్తోంది. గత నెల 26 నుంచి 11 రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 76.79 లక్షల చలాన్లకు సంబంధించి రూ.66.77 కోట్ల చెల్లింపులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేస్ రద్దు.. కేటీఆర్ ఆగ్రహం
ఈ అవకాశం మరో 5 రోజులు అంటే.. ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే ఉందని.. వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ సూచించారు. ఈనెల 10వ తేదీ వరకు వాహనదారులు పెండింగ్ చలాన్లపై రాయితీతో చెల్లింపులకు అవకాశం ఉంది. చెల్లింపులకు ఇంకా 5 రోజుల సమయం ఉండటంతో ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, చలానాల చెల్లింపులో ఏమైనా సందేహాలు ఉంటే.. 040-27852721, 87126616909(వాట్సాప్) నెంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.