Sangareddy : ఏం కష్టం వచ్చింది తల్లీ.. ప్రాణాలు తీసుకున్నావు.. బీటెక్ విద్యార్ధిని బలవన్మరణం..
బీటెక్ విద్యార్ధిని రేణుశ్రీ బలవన్మరణం సంచలనం రేపుతోంది. ఏం కష్టమొచ్చిందో? తెలియలేదు కానీ.. కన్నవారికి పుట్టెడు దుఖం మిగులుస్తూ తరలిరాని లోకాలకు వెళ్లిపోయింది.

BTech Student RenuSri
Sangareddy : చూడ చక్కని రూపం..చక్కగా చదువుకుంటోంది.. ఎంతో భవిష్యత్ ఉన్న అమ్మాయి.. ఏం కష్టం వచ్చిందో? రోజూ లాగే కాలేజీకి వెళ్లింది. కానీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. గీతం యూనివర్సిటీ బిల్డింగ్ పై నుండి దూకి బలవన్మరణానికి పాల్పడిన విద్యార్ధిని రేణుశ్రీ మరణం సంచలనం రేపింది.
ఇటీవల కాలంలో విద్యార్ధుల బలవన్మరణాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇష్టం లేని చదువులా? లెక్చరర్ల ఒత్తిడా? ఫ్యామిలీ సమస్యలా? ప్రేమ వ్యవహారాలా? తోటి విద్యార్ధుల వేధింపులా? కారణం ఏదైనా క్షణికావేశానికి లోనవుతున్నారు. ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోలేక తమను తాము బలి చేసుకుంటున్నారు. తాజాగా బీటెక్ విద్యార్ధిని రేణుశ్రీ బలవన్మరణం సంచలనం రేపింది.
పటాన్‌చెరు మండలం రుద్రారం గీతం వర్సిటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతోంది రేణుశ్రీ. యూనివర్సిటీలో చేరి కూడా 3 నెలలు అవుతోంది. రేణుశ్రీ స్వస్థలం పశ్చిమగోదావరి అని.. తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా హైదరాబాద్ కూకట్‌పల్లికి వచ్చి స్థిరపడ్డారని తెలుస్తోంది. రోజూలాగే యూనివర్సిటీకి బయలుదేరిన రేణుశ్రీ బిల్డింగ్ గోడపై నుండి దూకేసి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం కానీ, తోటి స్నేహితులు కానీ స్పందించలేదు.
రేణుశ్రీ మరణవార్త విన్న తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. తమ కూతురు ఇక తిరిగి రాదని తెలిసి తల్లడిల్లిపోయారు. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మీడియాలో వచ్చిన రేణుశ్రీ ఫోటోలు చూసిన వారిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఎంతో భవిష్యత్ ఉన్న రేణుశ్రీ మరణం వెనుక బలమైన కారణం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.