Hyderabad Traffic Rules: న్యూ ఇయర్ వేళ.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ ప్రాంతాల్లో అంటే..
న్యూఇయర్ వేడుకల సందర్భంగా బేగంపేట్, లంగర్ హౌస్ ప్లైఓవర్ మినహా నగరంలోని మిగతా ప్లై ఓవర్లన్నీ మూసిఉంచుతారు. శనివారం రాత్రి 10గంటల నుంచి 1వ తేదీ తెల్లవారు జామున 2గంటల వరకు నగరంలోకి బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలు అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ సీపీ ఆనంద్ తెలిపారు.

Trafic Rules
Hyderabad Traffic Rules: మరికొద్ది గంటల్లో 2022 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోనుంది. 2023కు ఘనస్వాగతం పలికేందుకు భాగ్యనగర వాసులు సన్నద్ధమయ్యారు. సాయంత్రం వేళ ఆటపాటలతో సందడిచేస్తూ 2023 సంవత్సరానికి భాగ్యనగర వాసులు స్వాగతం పలకనున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా శనివారం రాత్రి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో శనివారం రాత్రి 10గంటల నుంచి 1వతేదీ తెల్లవారు జామున 2గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
న్యూఇయర్ వేడుకల సందర్భంగా బేగంపేట్, లంగర్ హౌస్ ప్లైఓవర్ మినహా నగరంలోని మిగతా ప్లై ఓవర్లన్నీ మూసిఉంచుతారు. 1వ తేదీ తెల్లవారు జామున 2గంటల వరకు నగరంలోకి బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలు అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ సీపీ ఆనంద్ తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
– ఖైరతాబాద్ వీవీ విగ్రహం వద్ద నుంచి నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ వైపునకు వాహనాలకు అనుమతి లేదు. వాహనాలను రాజ్ భవన్ రోడ్డులోకి మళ్లిస్తారు.
– బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్, లక్డీకపూల్ వైపు మళ్లిస్తారు.
– లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ కు వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి తెలుగు తల్లి చౌరస్తా, ఇక్బాల్ మినార్ వైపు నుంచి రవీంధ్రభారతి వైపు మళ్లిస్తారు.
– ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలు ఖైరతాబాద్ గణేశ్ వద్ద సెన్సేషన్ థియేటర్, రాజ్ దూత్, లక్డీకపూల్ వైపు వెళ్లాలి.
– మింట్ కాంపౌండ్ నుంచి సచివాలయం వెళ్లే లైన్‌లోకి సాధారణ వాహనదారులకు అనుమతి ఉండదు. ఈ రోడ్డు మూసేస్తారు.
– నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి నుంచి సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు వైపు వాహనాలకు అనుమతి ఉండదు. ఈ వాహనాలను పీవీఎన్ఆర్ మార్గ్, మినిస్టర్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
– సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను షెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ క్రాస్ రోడ్డ, లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ ఆలయం మీదుగా మళ్లిస్తారు.