Malavath Poorna creating records : ఆమె ఓ శిఖరం. పుట్టింది ఓ మారుమూల పల్లెలోనే..కానీ..ఆమె ఇప్పుడు ఆకాశమే హద్దుగా, సాహసమే ఊపిరిగా సాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతాలను ఎక్కుతూ రికార్డులపై రికార్డులు సృష్టిస్తోంది. అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరం ఎక్కి చరిత్ర సృష్టించిన ఆమె.. ఇప్పుడు అర్జెంటీనాలోని అకోంకాగ్వా పర్వతాని అధిరోహించి మరో రికార్డును సొంతం చేసుకుంది. ఆమె ఎవరో కాదు… గిరిజన యువతి మాలావత్ పూర్ణ. మహిళా దినోత్సవం సందర్భంగా… పూర్ణ సాహసిగా మారిన వైనంపైన 10టీవీ కథనం..
మాలావత్ పూర్ణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరేమో. అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరం ఎక్కి… అందరిచేత శెభాష్ అనిపించుకుంది పూర్ణ. అంతటితోనే తన ప్రయత్నానికి ఫుల్‌స్టాప్ పెట్టలేదు. ఒక్కొక్క శిఖరాన్ని అధిరోహిస్తూ.. ఒక్కొక్క రికార్డును సృష్టిస్తూ వస్తోంది.
మాలావత్ పూర్ణ ఓ గిరిజన యువతి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల స్వగ్రామం. మాలావత్ దేవిదాస్, లక్ష్మీ దంపతుల సంతానం. నిరుపేద కుటుంబంలో పుట్టిన పూర్ణ.. సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది. అక్కడే ఆమె పర్వతారోహణ శిక్షణ తీసుకుంది. గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ వెన్నుతట్టి ప్రోత్సహించడంతో…. మౌంటనీర్‌లో ట్రైనింగ్ మొదలుపెట్టింది. భువనగిరిలో మొదలైన శిక్షణ.. లద్దాఖ్, డార్జిలింగ్, మౌంట్ రెనాక్, అధిరోహణ సాధన వరకు సాగింది.
శిక్షణ పూర్తయిన తర్వాత పూర్ణ.. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని టార్గెట్‌గా పెట్టుకుంది. తన 14వ ఏటనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తన కలను సాకారం చేసుకుంది. అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన బాలికగానూ రికార్డ్ సొంతం చేసుకుంది. ఎవరెస్ట్ శిఖర అధిరోహణ తన జీవితాన్ని మలుపు తిప్పిందని చెబుతోంది.
కడు నిరుపేద కుటుంబంలో పుట్టింది పూర్ణ. తల్లిదండ్రులు భయంతో మొదట్లో సాహస యాత్రకు వద్దని చెప్పారు. అయినా పూర్ణ ఏమాత్రం భయపడలేదు. బెదరలేదు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకే సాగింది. కఠోర సాధన చేసి… చివరికి ఒక్కొక్క పర్వతాన్ని అధిరోహిస్తూ వస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాత్రింబవళ్లు సాహస యాత్ర చేస్తూ రికార్డులపై రికార్డులు నెలకొల్పుతోంది.
గడిచిన నాలుగేళ్లలో నాలుగు పర్వతాలను అధిరోహించింది. 2016లో ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారా పర్వతాన్ని ఎక్కేసింది. 2017లో రష్యాలోని మౌంట్ ఎల్ బ్రుష్‌ను అధిరోహించింది. 2018లో అర్జెంటీనాలోని అకోంకాగ్వా శిఖరాన్ని అధిరోహించింది. త్వరలో మరో మూడు పర్వతాలను అధిరోహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐఏఎస్‌గా స్థిరపడడం తన జీవిత లక్ష్యమని పూర్ణ చెబుతోంది.
ప్రతిభకు పేదరికం ఏమాత్రం అడ్డుకాదని నిరూపించింది ఈ గిరిజన పుత్రిక. చిన్నతనం నుంచే పర్వతారోహన చేస్తూ నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆడది అంటే అబలకాదు.. సబల అంటూ నిరూపించింది. ఈ మహిళా దినోత్సం సందర్భంగా 10టీవీ మాలావత్ పూర్ణకు హ్యాట్సప్ చేబుతోంది. పూర్ణ సక్సెస్ ఫుల్ జర్నీ ఇలాగే కంటిన్యూ కావాలని ఆకాంక్షిస్తోంది.