సంక్రాంతి స్పెషల్: రెండెకరాల్లో కారు గుర్తు ముగ్గు

సంక్రాంతి స్పెషల్: రెండెకరాల్లో కారు గుర్తు ముగ్గు

Updated On : January 15, 2020 / 1:33 AM IST

ఓ వైపు సంక్రాంతి.. మరో పక్క తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు కావడంతో రాష్ట్ర ప్రజల్లో డబుల్ జోష్ మొదలైంది. తమకు పార్టీల పట్ల ఉన్న అభిమానాన్ని సంక్రాంతి ముగ్గుల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. ఇంటింటా కారు గుర్తును రంగవల్లుల్లో ఉంచుతుంటే.. సిరిసిల్లలో మాత్రం రెండెకరాల్లో ముగ్గు వేసి ఆశ్చర్యపరిచారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్లలో సుమారు 200 మంది మహిళలు 2 ఎకరాల్లో కారు గుర్తు ముగ్గు వేశారు. కేవలం మూడు గంటల్లోనే ఈ ముగ్గును సిద్ధం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారీ కారు గుర్తు ముగ్గు వేయడం స్థానికులను బాగా ఆకర్షిస్తోంది. 

జిల్లాకేంద్రంలోని సిరిసిల్ల- వేములవాడ బైపాస్‌ రోడ్డులో మంగళవారం వేసిన కారు ముగ్గు ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముగ్గును చూసేందుకు వాహనదారులు, స్థానిక ప్రజలు బైపాస్‌ రోడ్డుకు తరలివచ్చారు. ముగ్గువేసిన మహిళలకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.