TS 10th Exams: టెన్త్ హిందీ పరీక్ష ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో వచ్చింది నిజమే..: అధికారుల నిర్ధారణ

తెలంగాణలో వరుసగా చోటుచేసుకుంటున్న పరీక్ష ప్రశ్నపత్రాల లీకులు కలకలం రేపుతున్నాయి. మరోసారి ప్రశ్నపత్రాల లీక్ జరగకుండా చూసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కానీ, ఇటువంటి ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. లీకులను అరికట్టలేకపోతున్నారు.

TS 10th Exams

TS 10th Exams: అదే నిర్లక్ష్యం.. అదే అసమర్థత.. తెలంగాణలో నిన్న పదో తరగతి పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో కనపడడం కలకలం రేపిన ఘటనను మరవకముందే ఇవాళ కూడా అటువంటి ఘటనే చోటుచేసుకుంది. నిన్నటి తెలుగు పరీక్ష ప్రశ్న పత్రం వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ కేంద్రం నుంచి లీకైతే నేటి హిందీ ప్రశ్నపత్రం హనుమకొండలోని ఓ కేంద్రం నుంచి బయటకు వచ్చింది.

బాగా చదివి పరీక్షలు రాసే విద్యార్థులంతా ఆందోళనకు గురవుతున్నారు. వాట్సాప్ గ్రూప్ లలో వచ్చిన ప్రశ్నపత్రం, నేటి హిందీ పరీక్ష ప్రశ్నపత్రం ఒక్కటే అని జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్దారణకు వచ్చారు. ఆ పేపర్ ఎక్కడి నుండి వచ్చిందనే విషయంపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. వరంగల్, హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారులు వరంగల్ పోలీస్ కమిషనర్ కు పిర్యాదు చేశారు. పరీక్ష కేంద్రం నుండి ఎవరు లీక్ చేశారనేది పోలీసుల విచారణలో తేలుతుందని అన్నారు.

సోషల్ మీడియాలో పేపర్ రావడంతో వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేశామని తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు వివరాలు అడిగారని చెప్పారు. నిజానిజాలపై విచారణకు ఆదేశించారని తెలిపారు. ఆ పేపర్ వరంగల్ ఉమ్మడి జిల్లాలో లీకైందా? పక్క జిల్లా నుండి వచ్చిందా? అనేది పోలీసుల విచారణలో తేలుతుందని చెప్పారు. ఈ మేరకు వరంగల్, హనుమకొండ డీఈఓలు ఓ ప్రకటన చేశారు.

10th Question Paper Leak: టెన్త్ పేపర్ లీకేజ్ ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు..