TSWREIS National Seminar: శాస్త్ర, సాంకేతికతలో జరుగుతున్న అభివృద్ధిని యువత అందుపుచ్చుకొని నూతన ఆవిష్కరణలు చేస్తూ భారతదేశాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని విద్యావేత్తలు పిలుపునిచ్చారు. సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించి పర్యావరణానికి హానిచేయని హరిత రసాయన శాస్త్రాన్ని ప్రోత్సహించాలని ఆకాంక్షించారు. ప్రపంచం ఆపదలో ఉన్నప్పుడు భారత శాస్త్రవేత్తలు ముందుండి కరోనా లాంటి మహమ్మారి నిర్మూలనకు వ్యాక్సిన్ కనిపెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రంగారెడ్డి జిల్లా కాన్హా గ్రామంలోని ‘కాన్హా శాంతి’ వనంలో రెండు రోజుల పాటు ఫిబ్రవరి 24, 25 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల(మహేంద్ర హిల్స్) రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. రసాయన శాస్త్ర సాంకేతికత సుస్థిర అభివృద్ధి -అవకాశాలు, అవరోధాలు అనే అంశంపై ఇందులో చర్చించారు.
మొదటిరోజు ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ శాస్త్ర సాంకేతిక విభాగ కార్యదర్శి శ్రీవారి చంద్రశేఖర్ ప్రసంగిస్తూ.. సమకాలీన రసాయన శాస్త్రంలో జరుగుతున్న పరిశోధనలు, నూతన ఆవిష్కరణలలో విద్యార్థుల భాగస్వామ్యం గురించి వివరించారు. కార్యక్రమానికి అధ్యక్షులుగా సాంఘిక సంక్షేమ సంస్థ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఉపకార్యదర్శి హనుమంత్ నాయక్ ముఖ్య ఆహ్వానితులుగా ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం(విసి, అనురాగ్ యూనివర్సిటీ), విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ బి. జగదీశ్వర్ రావు(విసి, హెచ్ సీయు) విచ్చేశారు. ప్రొఫెసర్ డి. అశోక్, ప్రొఫెసర్ ఎన్. తిరుమలాచార్య, గుంట లక్ష్మణ్ తమ సందేశాలను అందించారు. కార్యక్రమ నిర్వాహకురాలైన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నిరూప, సహకరించిన అధ్యాపకులను, పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
రెండవ రోజు కార్యక్రమంలో డాక్టర్ ఉపేంద్ర త్రిపాఠి, డాక్టర్ ఎన్. లింగయ్య, డాక్టర్ సోమేశ్వర పొలా, డాక్టర్ ఎన్. ఆనంద్, కే. నరసింహారాజు, జి.వెంకట్రావు స్పీకర్స్ గా వ్యవహరించి చక్కని మార్గదర్శకాలను సూచించారు. సదస్సు విజయవంతమైనందుకు కార్యదర్శి అభినందనలు తెలిపారు.
Also Read: మెడికో ప్రీతి కేసు.. నిందితుడు సైఫ్ అయినా సంజయ్ అయినా వదిలిపెట్టం- మంత్రి కేటీఆర్