Bandi Sanjay: భార్యాభర్తల మాటలూ విన్నారు.. వేల కోట్లు దోచుకున్నారు.. సీబీఐకి అప్పగించాలి- ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరైనా నార్మల్ కాల్ మాట్లాడాలన్నా భయపడ్డారు. ఈ కేసు విచారించడం రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు.

Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో అత్యధికంగా తన ఫోన్ కాల్ మాత్రమే ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. సిట్ అధికారులు తానిచ్చిన ఆధారాలు చూసి షాక్ కి గురయ్యారని చెప్పారు. మావోయిస్టుల లిస్టులో తన పేరు పెట్టి తన ఫోన్ ని ట్యాప్ చేశారని బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా మావోయిస్టుల లిస్టులో చేర్చారని చెప్పారు. మాజీమంత్రి హరీశ్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారని అన్నారు.

”ఫోన్ ట్యాపింగ్ కేసులో మొట్టమొదటి బాధితుడిని నేనే. కేసీఆర్ ప్రభుత్వంలో వావి వరసలు లేవు. నా కుటుంబసభ్యులు, సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేశారు. కేసీఆర్ సొంత బిడ్డ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నపుడు ఏ ఆందోళనకు పిలుపిచ్చినా వెంటనే తెలుసుకుని ఎక్కడిక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. గతంలోనే నాకు అనుమానం వచ్చింది.

కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరైనా నార్మల్ కాల్ మాట్లాడాలన్నా భయపడ్డారు. భార్యభర్తలు ఫోన్లు విన్న మూర్ఖులు వీళ్లు. కేసీఆర్ కుటుంబం దిక్కుమాలిన కుటుంబం. ఎస్ఐబీ.. సంఘ విద్రోహ శక్తుల సమాచారం సేకరించడానికి పని చేస్తుంది. ఎస్ఐబీని అడ్డుపెట్టుకుని వేలాది ఫోన్లు ట్యాప్ చేశారు. ట్విట్టర్ టిల్లు మావోయిస్టుల ఫోన్లు కాకుండా రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేయించారు. వారిని కూడా విచారణకు పిలవాలి. సొంత లావాదేవీల కోసం కేటీఆర్ ఫోన్లు ట్యాప్ చేయించారు. గ్రూప్ వన్ పేపర్ లీకేజీపై నేను ఆందోళన చేస్తుంటే నా ఫోన్ ట్యాప్ చేశారు. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ కేసు విచారణ చేస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ప్రభాకర్ రావు గ్యాంగ్ ను సమాజం క్షమించదు. ఉరి శిక్ష వీరికి సరైన శిక్ష.

నిందితులను కాపాడే ప్రయత్నం రేవంత్ ప్రభుత్వం చేస్తోంది. చాలామంది వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు దోచుకున్నారు. ఫోన్ ట్యాప్ చేసి కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థికి చెందిన డబ్బులు 7 కోట్లు పట్టుకున్నారు. ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్న డబ్బులు కేసీఆర్, కేటీఆర్ కు వెళ్ళాయి.

రేవంత్ సర్కార్ చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతోంది. సిట్ అధికారులపై మాకు నమ్మకం ఉంది. వారికి స్వేచ్ఛ ఇవ్వాలి. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నడుపుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు. ఆయన్ని పిలిచి విచారించే దమ్ము ఉందా అధికారులకు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ కు అప్పగించాలి.

ఫార్మ్ హౌస్ కేసులతో పాటు చాలా కేసులు నీరు జారాయి. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ కు రేవంత్ క్లీన్ చిట్ ఇచ్చారు. కేసీఆర్, రేవంత్ ఇద్దరూ ఒక్కరే. కేసీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకోమని రేవంత్ చెప్పారు. కేసీఆర్ ను అరెస్ట్ చేయాలా వద్దా? అని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు..? కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు లోపాయికారి ఒప్పందం ఉందని మేము మొదటి నుండి చెబుతున్నాం. ఈ కేసు విచారించడం రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు. ఈ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు అప్పగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వడంలో మీ అభ్యంతరం ఏంటి? ఏ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు లేవు.. ఈ రాష్ట్రంలోనే ఎందుకు..?” అని ప్రశ్నించారు బండి సంజయ్.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా బండి సంజయ్ స్టేట్ మెంట్ ను సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సిట్ కు ఆధారాలు సమర్పించారు. బండి సంజయ్ సమర్పించిన ఆధారాలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు.

Also Read: 100మంది.. మూడేళ్లుగా అదే పని.. మెడిసిటీ మెడికోల గంజాయి కేసులో కొత్త కోణం