నేను ఏపీకే కాదు.. తెలంగాణకు కూడా.. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పి సూచనలు చేశారు: రామ్మోహన్ నాయుడు

గతంలో కిషన్ రెడ్డి ఉడాన్ స్కీమ్ లో మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేశారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని చెప్పుకొచ్చారు.

మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మించాలన్నది అక్కడి స్థానికుల చిరకాల కోరిక అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని సీజీవో టవర్స్‌లో 2025-26 కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన మ్యాగజైన్‌ను రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. “నేను ఏపీకే కాదు.. తెలంగాణకు, యావత్ దేశానికి మంత్రినని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ నాకు పలు సూచనలు చేశారు” అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటే తెలంగాణకు కూడా అభివృద్ధి జరగాలని చంద్రబాబు చెప్పారని తెలిపారు. మామునూరు విమానాశ్రయానికి సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద 696 ఎకరాల స్థలం ఉందని చెప్పారు. మరో 280 ఎకరాల స్థలం కావాల్సి ఉందని, ప్రస్తుత రన్ వే 1600 మీటర్లు ఉందని తెలిపారు.

Also Read: 2025లో జరిగే అరిష్టాలు, విధ్వంసాలు ఇవే.. టైమ్ ట్రావెల్‌ చేసొచ్చి మరీ.. తేదీలతో పాటు చెబుతున్నాడట ఇతడు.. 

ఎయిర్ బస్ లాంటి విమానాలకు 2800 మీటర్ల రన్ వే అవసరమని అన్నారు. గతంలో కిషన్ రెడ్డి ఉడాన్ స్కీమ్ లో మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేశారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో ఇక్కడ బ్రహ్మాండమైన ఎయిర్ పోర్ట్ నిర్మిస్తామని అన్నారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని నిర్మిస్తుందని చెప్పారు.

టర్మినల్ బిల్డింగ్ నిర్మాణాన్ని కాకతీయుల చరిత్ర ప్రస్ఫుటిల్లేలా చేపడతామని అన్నారు. 280 ఎకరాల భూమి సేకరణ చేపట్టాల్సి ఉందని చెప్పారు. ఎక్కడైనా విమానాశ్రయం ఏర్పాటయితే ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని అన్నారు. 1947కి ముందు మామునూరు ఎయిర్ పోర్ట్ దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయమని, అనంతరం హైదరాబాద్ రాజధాని కావడంతో ఈ విమానాశ్రయానికి తాకిడి తగ్గిందని రామ్మోహన్ నాయుడు చెప్పారు.

మోదీ ప్రధాన మంత్రి కాకముందు భారత్‌లో 76 విమానాశ్రయాలు ఉంటే ఆయన ప్రధాని అయ్యాక ఇప్పటివరకు 159 విమానాశ్రయాలకు ఆ సంఖ్య పెరిగిందని తెలిపారు. మామునురులో ముందుగా డొమెస్టిక్, కార్గోకు వినియోగిస్తామని, డిమాండ్ ను బట్టి ఇంటర్నేషనల్ కూడా ప్లాన్ చేస్తామని అన్నారు. హైదరాబాద్ టు శ్రీశైలం సీ ప్లేన్ ఏప్రిల్ లో ప్రారంభిస్తామని చెప్పారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం వరంగల్లులో విమానాశ్రయం కావాలనే డిమాండ్ ఉందని అన్నారు. అందుకే కేంద్రం మామునూరులో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. దీనిపై గత ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా గత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చర్చించారని తెలిపారు.