Vanama Venkateshwara Rao
Vanama Venkateshwara Rao: తెలంగాణలోని కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ మళ్లీ తనదేనని, తానే పోటీ చేస్తానని బల్లగుద్ది చెబుతున్నారు ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత వనమా వెంకటేశ్వర రావు. కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ కోసం ఇప్పటి నుంచే పోటీ మొదలైంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే, పలువురు స్థానిక బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇవాళ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం పట్టణంలోని రామవరంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఉద్దేశించి కొత్తగూడెం ఘాటు వ్యాఖ్యలు చేశారు. “నాప్రాణం ఉన్నంత కాలం కొత్తగూడెం అభివృద్ధికి కృషి చేస్తా. కొత్తగూడెం పట్టణం సరిహద్దులు తెలియని వాళ్లు ఇక్కడకు వచ్చి డ్రామాలు చేస్తున్నారు. నీకు సొమ్ములు ఎక్కడి నుంచి వచ్చాయి?
నీ అసలు సంగతి బట్టబయలు చేస్తాం. కొత్తగూడెం గడ్డలో పుట్టి పెరిగింది నేను.. అసలు ఎవరు నువ్వు, ఇక్కడ వార్డు మెంబెర్ స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు చేసింది నేను. మీ ఆటలు ఇక్కడ సాగవు అందరూ కొత్తగూడెం వస్తున్నారు. మేము ఏమైనా చెవులో పూలు పెట్టుకున్నామా? కొత్తగూడెం నుంచి మళ్లీ పోటీ చేసేది నేనే, కేసీఆర్, కేటీఆర్ ఆశీర్వాదంతో గెలిచేది నేనే” అని అన్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు రాజకీయాల్లోకి వస్తున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.