VC Releases Press Note on IT Students Protest
Basara IIIT Protest : బాసర ఐటీ విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఆంక్షలు విధించారు. ట్రిపుల్ ఐటి మెయిన్ గేట్‌ను బారికేడ్లతో మూసివేశారు పోలీసులు. విద్యార్థుల నిరసన 3వ రోజుకు చేరుకుంది. మెయిన్ గేటు వద్ద పలువురు విద్యార్థుల శాంతియుత నిరసన తెలిపారు.
వీ వాంట్ రెగ్యులర్ వీసి అంటూ నినాదాలు తెలుపుతున్నారు. లోపల బారికేడ్లను దాటుకుని మెయిన్ గేటు వద్దకు విద్యార్థులు దూసుకొచ్చారు. ట్రిపుల్ ఐటీలోకి వెళ్లే విద్యార్థులు, సిబ్బందిని తనిఖీలు చేసిన తర్వాతే సెక్యూరిటీ లోపలికి అనుమతిస్తున్నారు.
రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే క్రమశిక్షణా చర్యలు :
ఇదిలా ఉండగా, బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆందోళనపై వీసీ వెంకటరమణ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయి, ఫీజు బకాయిలు చెల్లించని విద్యార్థులే ఆందోళన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రెండు మూడేళ్ళుగా కొందరు ఫీజులు చెల్లించడం లేదని, చట్టవిరుద్ధంగా తమ కోర్సును కొనసాగించడమే కాకుండా క్యాంపస్‌కు ఆటంకం కలిగించడానికి యత్నిస్తున్నారని తెలిపారు. కేవలం 150 మంది విద్యార్థులే ఆందోళన చేస్తున్నారన్నారు.
బాలికలు ఎవరూ నిరసనలో పాల్గొనలేదని, మిగితా విద్యార్థులను ఆందోళన కోసం బలవంతం చేస్తున్నారని తెలిపారు. స్కాలర్ షిప్ విద్యార్థులు మినహా చాలామంది 3 లక్షల నుంచి 4 లక్షల ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. అయితే, క్యాంపస్‌లో విద్యా వాతావరణానికి భంగం కలిగించవద్దని నోటీసు జారీ చేసినట్టు తెలిపారు. రెచ్చగొట్టే ప్రయత్నం చేసే విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వీసీ వెంకటరమణ హెచ్చరించారు.
Read Also : CBSE Board Exam 2025 : సీబీఎస్ఈ మార్కింగ్ స్కీమ్, శాంపిల్ పేపర్లు విడుదల.. అధికారిక నోటిఫికేషన్ ఇదిగో..!