Ukraine Russia War : యుక్రెయిన్ లో చిక్కుకున్న బోడుప్పల్‌ యువతి.. రక్షించాలంటూ తల్లి ఆవేదన

యుక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలో 500 మంది వరకు భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి

Vemula Keerthi

Ukraine Russia War : హైదరాబాద్‌లోని బోడుప్పల్‌కు చెందిన వేముల కీర్తి…యుక్రెయిన్‌లో చిక్కుకుపోయింది. రష్యా సైనికులు విధ్వంసం సృష్టించిన ఖర్కీవ్‌ నగరంలోని మెట్రో అండర్‌ గ్రౌండ్‌ స్టేషన్లలో కీర్తితో పాటు పలువురు భారతీయ వైద్య విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. యుక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలో 500 మంది వరకు భారతీయ విద్యార్థులు ఉన్నారు.

వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తన కూతురుతో పాటు తెలుగు విద్యార్థులు, భారతీయ విద్యార్థులు అందరినీ రక్షించాలని వేముల కీర్తి తల్లి వేముల శ్రీదేవి డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని, ఎంబసీ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ లేదని ఆవేదన చేశారు.

Russia Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య ఐదో రోజు భీకర పోరు..కీవ్‌ నగరం మా ఆధీనంలోనే ఉందన్న యుక్రెయిన్‌ ఆర్మీ

యుక్రెయిన్‌లో చిక్కుకున్న జఫ్‌రోజియా మెడికల్‌ యూనివర్సిటీకి చెందిన 1400మందికి పైగా విద్యార్థులు మరికాసేపట్లో సరిహద్దులకు చేరుకోనున్నారు. గత నాలుగు రోజులుగా యూనివర్సిటీలోని బంకర్‌లలో తలదాచుకున్నారు విద్యార్థులు. ఇందులో దాదాపు 600మంది తెలుగు విద్యార్థులున్నట్లు తెలుస్తోంది. ఇవాళ అక్కడి రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైన్‌లో హంగేరికి చేరుకోనున్నారు విద్యార్థులు. విద్యార్థులందరినీ సురక్షితంగా భారత్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. యుక్రెయిన్‌ చుట్టుపక్కల దేశాలతో కూడా మాట్లాడుతున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. రష్యా, యుక్రెయిన్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ప్రపంచ దేశాల్లో ఏ ఒక్క దేశం కూడా యుక్రెయిన్‌లోని తమ పౌరులను తీసుకురావడానికి ప్రయత్నించడం లేదన్నారు. భారతదేశం మాత్రమే పౌరులను వెనక్కి తీసుకొస్తుందని చెప్పారు.