వీడెవడండీ బాబూ.. ఆధార్, పాన్, ఏటీఎం కార్డులను చెత్తకుప్పలో పడేసిన పోస్ట్ మ్యాన్

పోస్టాఫీసుకు వచ్చిన ఆధార్, పాన్, ఏటీఎం కార్డులు, లెటర్లు ఎవరికీ ఇవ్వలేదు. వాటన్నింటిని కార్యాలయంలోనే పెట్టుకున్నాడు. అలా 2011 నుంచీ ఇదే తంతు.

Vikarabad PostMan Negligence

Vikarabad PostMan Negligence : వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలో పోస్ట్ మ్యాన్ తీరు వివాదాస్పదమైంది. ప్రజలకు బట్వాడా చేయాల్సిన ఆధార్ కార్డులు, పాన్ కార్డులతో పాటు ఏటీఎంలను చెత్త బండిలో పడేశాడు. పోస్ట్ మ్యాన్ నర్సింహులు 2011 నుంచి కార్డులను పంచకుండా మూటకట్టి అన్నింటిని చెత్తలో వేశాడు. వీటిని గమనించిన స్థానికులు షాక్ కి గురయ్యారు. సుమారు 2వేల కార్డులు ఉన్నాయి. గ్రామ పంచాయితీ భవనంలో కార్డులను భద్రపరిచారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోస్టుమ్యాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

ఆధార్, పాన్, ఏటీఎం.. ఇలా ఏదైనా కార్డులు పోస్టాఫీసుకు వస్తే.. వాటిని జాగ్రత్తగా సంబంధిత వ్యక్తులకు చేరవేయాల్సిన బాధ్యత పోస్ట్ మ్యాన్ దే. వాటి మీదున్న అడ్రస్ ఆధారంగా వాటిని సంబంధిత వ్యక్తులకు అందజేయాలి. ఒకవేళ వాళ్లు ఆ అడ్రస్ లో లేకపోతే.. ఆ కార్డులను తిరిగి వెనక్కి పంపేయాలి. లేదా ఆఫీసులో ఇచ్చేయాలి. ఇదీ పోస్టుమ్యాన్ బాధ్యత. అయితే, అందుకు భిన్నంగా పోస్టుమ్యాన్ నర్సింహులు వ్యవహరించాడు. కార్డులను ఆయా వ్యక్తులకు ఇవ్వలేదు. సరికదా.. తిరిగి ఆఫీసులో రిటర్న్ చేయలేదు. వేల సంఖ్యలో ఉన్న ఆధార్, పాన్, ఏటీఎం కార్డులను మూటకట్టి చెత్తకుప్పలో పడేశాడు. చెత్త కుప్పలో పాన్, ఆధార్, ఏటీఎం కార్డులతో పాటు వందల సంఖ్యలో లెటర్లు కూడా ఉండటం చూసి స్థానికులు షాక్ కి గురయ్యారు.

Also Read : జనవరి 22 నుంచి చలామణిలోకి కొత్త 500 నోట్లు? గాంధీ స్థానంలో రాముడు? ఇందులో నిజమెంత

చౌడాపూర్ మండల కేంద్రలో నర్సింహులు పోస్ట్ మేన్ గా పని చేస్తున్నాడు. పోస్టాఫీసుకు వచ్చిన ఆధార్, పాన్, ఏటీఎం కార్డులు, లెటర్లు ఎవరికీ ఇవ్వలేదు. వాటన్నింటిని కార్యాలయంలోనే పెట్టుకున్నాడు. అలా 2011 నుంచీ ఇదే తంతు. లబ్దిదారులకు వచ్చిన ఆధార్, పాన్ కార్డులు, ఏటీఎంలు, లెటర్లు ఇవ్వకుండా అలాగే పెట్టుకున్నాడు. సడెన్ గా అవన్నీ కూడా ఇప్పుడు చెత్త కుప్పలో కనిపించటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పోస్టుమ్యాన్ నిర్లక్ష్యం బట్టబయలైంది.

కార్యాలయంలో పేరుకుపోయిన ఏళ్ల నాటి ఆధార్, పాన్, ఏటీఎం కార్డులు, లెటర్లు అన్నింటినీ మూటకట్టాడు పోస్టుమ్యాన్ నర్సింహులు. ఆ తర్వాత ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా చెత్త సేకరణ కోసం వచ్చిన గ్రామపంచాయతీ ట్రాక్టర్‌లో వేసేశాడు. వాటిని ఆ ట్రాక్టర్ లో తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేశారు. అయితే, అటుగా వెళ్లిన కొందరు స్థానికులు.. చెత్త కుప్పలో వాటిని గమనించి కంగుతిన్నారు. వేల సంఖ్యలో ఉన్న కార్డులను చూసి నివ్వెరపోయారు. అసలేం జరిగింది? అని ఆరా తీయగా.. పోస్టుమ్యాన్ నర్సింహులు నిర్లక్ష్యం బయటపడింది.

పోస్టుమ్యాన్ నిర్వాకంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. తాము ఎంతో కష్టపడి ఆధార్ కేంద్రాలకు వెళ్లి కార్డుల కోసం అప్లయ్ చేస్తే.. అవి వచ్చినా తమకు ఇవ్వకపోవడం దారుణం అంటున్నారు. ఆధార్, పాన్, ఏటీఎం కార్డుల గురించి ఎన్నిసార్లు అడిగినా.. ఇంకా రాలేదని జవాబిచ్చేవాడని స్థానికులు గుర్తు చేసుకున్నారు. ప్రతి నెలా జీతం తీసుకుంటున్నా.. ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదంటున్నారు. విధుల పట్ల అంతులేని నిర్లక్ష్యం వ్యవహరించిన ఆ పోస్టుమ్యాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు.

Also Read : ‘అయోధ్య రామ మందిర ప్రసాదం’ అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు కేంద్రం నోటీసులు జారీ