Naini Rajender Reddy : వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ పంచాయతీ వ్యవహారం గాంధీభవన్ చేరింది. వరంగల్ వెస్ట్ లో ఎమ్మెల్యేగా తానే పోటీ చేస్తానని జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డి ప్రకటించడంతో పంచాయతీ మొదలైంది. జంగా రాఘవరెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు గాంధీ భవన్ వెళ్లారు వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి. ఒక జిల్లా అధ్యక్షుడు మరో జిల్లాలో వేలు పెడుతున్నాడంటూ ఫిర్యాదు చేశారు. గతంలో జంగాకు షోకాజ్ నోటీసులు ఇచ్చినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నాయిని రాజేందర్ రెడ్డి. ఈరోజు ఏదో ఒకటి తేల్చేదాక గాంధీ భవన్ నుంచి వెళ్లేది లేదని నాయిని తేల్చి చెప్పారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్ లో లొల్లి షురూ అయ్యింది. ఈసారి ఆ సీటు నాదే అంటే.. నాదే అంటూ.. ఎవరికి వారు ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలతో క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అలాంటి పరిస్థితే నెలకొంది. కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి, జనగామ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. నాయిని ఇదివరకు రెండుసార్లు టికెట్ ఆశించి భంగపడగా.. ఈసారి ఎలాగైనా టికెట్ తనకే అనే భావనలో ఉన్నారు. జంగా రాఘవరెడ్డి కూడా తగ్గేదేలే అంటున్నారు. టికెట్ కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య ఎప్పటినుంచో వర్గపోరు నడుస్తోంది.
కాంగ్రెస్ ఇటీవల చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా మరోసారి ఇరువురి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఒకే నియోజకవర్గంలో ఇద్దరూ వేర్వేరుగా పాదయాత్రలు చేయడం, టికెట్ తమదేనంటూ చెప్పుకోవడం.. విభేదాలు బయటపడటమే కాకుండా క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొంది. పార్టీ కార్యకర్తలు రెండువర్గాలు చీలిపోయారు.
పక్క జిల్లా నుంచి వచ్చిన కొందరు నాయకులు స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తో కుమ్మక్కై ఇక్కడి కార్యకర్తలను కార్యక్రమాలకు రాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని, వారిని రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఖాయమని నాయిని రాజేందర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.