cold wave alert
Weather Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలను నిన్నటి వరకు ఎడతెరిపిలేని వర్షాలు హడలెత్తించాయి. ఇటీవల మొంథా తుపాన్ రెండు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తుపాను ప్రభావం తగ్గడంతో ఇప్పుడిప్పుడే ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు. వర్షాలు కూడా పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టాయి. అయితే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలపై చలి పులి పంజా విసురుతోంది. భయంకర కోల్ద్ వేవ్ కారణంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మూడ్రోజులు జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేసింది.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. రెండుమూడు రోజులుగా ఉదయం, రాత్రి వేళల్లో చలి గజగజలాడిస్తుంది. అయితే, వచ్చే మూడ్రోజులు సోమ, మంగళ, బుధ వారాల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు దంచికొట్టాయి. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాల కారణంగా ఎడతెరిపిలేని వర్షాలు కురిశాయి. దీనికితోడు ప్రస్తుతం ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి దిగువ స్థాయి గాలులు రాష్ట్రం వైపు వీస్తుండటంతో చలి తీవ్రత పెరుగుదలకు దోహదం చేస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. పటాన్ చెరులో 16.8 డిగ్రీల సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా.. 3.6 డిగ్రీలు తగ్గి 13.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అదిలాబాద్ లో 14.2, మెదక్ జిల్లాలో 14.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇదిలాఉంటే.. నవంబర్ నెలలో చలి విజృంభణ కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా నవంబర్ 11 నుంచి 19వ తేదీ వరకు అతి చల్లని గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. నవంబర్ 13 నుంచి 17వ తేదీ మధ్యలో తెలంగాణలో చలి మరింత ఎక్కువ తీవ్రంగా ఉంటుందని, అప్పుడు రాత్రివేళ ఉష్ణోగ్రతలు 9డిగ్రీల సెల్సియస్ కు పడిపోతాయని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చలి భారి నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది.
ముఖ్యంగా రాష్ట్రంలోని అదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
COLD WAVE ALERT FOR TELANGANA ⚠️🥶
GET READY for strong November winters, a 8-10day STRONG COLD WEATHER especially during Nov 11-19 (Peak during Nov 13-17) with SINGLE DIGIT TEMPERATURES expected in PINK marked districts
BLUE marked districts including Hyderabad City will… pic.twitter.com/H7Mg4Ws2tT
— Telangana Weatherman (@balaji25_t) November 9, 2025