Wedding Season
Wedding Season : తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సిన అనేక వివాహ వేడుకలు, శుభకార్యాలు, ఫంక్షన్‌లకు మూఢం కారణంగా బ్రేక్ పడింది. అయితే, ఇప్పుడు మళ్లీ శుభగడియలు తరుముకొస్తున్నాయి. దాదాపు మూడు నెలల విరామం తరువాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెండ్లిళ్ల బాజాలు మోగబోతున్నాయి.
నవంబర్ నెల నుంచి మూఢాల కారణంగా శుభ ముహూర్తాలు లేకుండా పోయాయి. శుక్ర మౌఢ్యమి ఈనెల 17న ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు నెలల తరువాత పెళ్లిళ్లు, రిసెప్షన్లతో కల్యాణ మండపాలు మళ్లీ కళకళలాడనున్నాయి.
మన పంచాగాల ప్రకారం.. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి శుభముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి. 19, 20, 21, 24, 25, 26తేదీలు వివాహాలకు అనుకూలంగా ఉన్నాయి. 19, 20, 21 తేదీల్లో గృహ ప్రవేశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
ఫిబ్రవరి 21వ తేదీన ఎక్కువ పెళ్లిళ్లు జరగనున్నాయి. ఆ రోజు పంచమి మరీ మంచి ముహూర్తం కావడం, అలాగే వీకెండ్ కావడం కారణంగా భారీ సంఖ్యలో వివాహాలకు ముహూర్తాలను నిర్ణయించుకున్నట్లు పండితులు చెబుతున్నారు. ఫిబ్రవరి నెల తరువాత మార్చి, ఏప్రిల్, మే, జూన్, జులై వరకు అన్నీ మంచి రోజులే ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు.
మార్చి నెలలో 4, 5, 6, 7, 8, 11, 12, 13, 14, 20, 21, 25, 29 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. అదేవిధంగా ఏప్రిల్ నెలలో 1 నుంచి 8వ తేదీ వరకు.. ఆ తరువాత 10, 11, 12, 21, 25, 26, 28, 29, 30 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. మే నెలలో 1, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 13 తేదీల్లో.. జూన్ నెలలో 19, 20, 21, 24, 25, 26, 27, 28 తేదీల్లో, జులై నెలలో 1, 2, 3, 5, 8, 9 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు చెబుతున్నారు.
ఫిబ్రవరి నెల నుంచి మార్చి, ఏప్రిల్, మే, జూన్ , జులై నెలల్లో కూడా వరుసగా శుభ ఘడియలు ఉండటంతో పురోహితులు, వెడ్డింగ్ ప్లానర్లు, క్యాటరర్ల డైరీలు పూర్తిగా నిండిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న పరిస్థితి నెలకొంది.
ఫంక్షన్ హాళ్లు, పురోహితులు, క్యాటరింగ్ సర్వీసుల రేట్లు ఆకాశాన్నంటడంతో వధూవరుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాదికి ప్రస్తుత ఏడాదికి ధరలు విపరీతంగా పెరిగాయి. పురోహితుల దగ్గర నుంచి క్యాటరింగ్ వాళ్లు, డెకరేషన్స్, పెండ్లి సామాగ్రి, కూరగాయలు, మాంసం ధరలు భారీగా పెరిగాయి.
ఇక ప్రధానమైన మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ ధరలు భగ్గుమంటున్నాయి. చిన్నచిన్న ఫంక్షన్ హాళ్లు సైతం లక్షల్లో చెల్లించాల్సిందే.. ఇక పెద్ద ఫంక్షన్ హాల్స్ అయితే.. రూ. 10లక్షల నుంచి రూ. 13లక్షలకు తక్కువకు రానిపరిస్థితి.
పెళ్లిళ్లు, గృహప్రవేశాలతో పాటు ఇతర శుభకార్యాలకు ముహుర్తాలు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో శుభకార్యాలకు సిద్ధమయ్యే పేద, మధ్యతరగతి కుటుంబాలు పెరిగిన ధరలతో ఆందోళన చెందుతున్నారు.