తెలంగాణ ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం..! కారణం అదేనా?

రోజురోజుకు సర్కార్ ఆదాయం తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వ పెద్దలు కలవర పడుతున్నారు.

Telangana Govt Income Falls : తెలంగాణలో ప్రభుత్వ ఆదాయం క్రమంగా తగ్గుముఖం పడుతుండటం రేవంత్ సర్కార్ కు ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం అంతకంతకూ పడిపోవడం ఆర్థికశాఖను కలవర పెడుతోంది. గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రెవెన్యూ తగ్గడానికి హైడ్రా ప్రభావమే కారణమని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే అంతంత మాత్రంగానే ఉన్న సర్కార్ ఖజానా.. ఇప్పుడు ఆదాయం తగ్గడంతో మరింత ఇబ్బందుల్లో పడుతుంది.

తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. రోజురోజుకు సర్కార్ ఆదాయం తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వ పెద్దలు కలవర పడుతున్నారు. ప్రధానంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం పట్ల ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వరుసగా 2024 ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది. ఆగస్టులో ఒక లక్ష 48వేల 643 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగ్గా.. రూ.1,307 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

అంతకుముందు నెల జూలైలో 2లక్షల 04వేల 776 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగ్గా.. రూ.1639 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అంటే జూలై నెలతో పోలిస్తే ఆగస్టులో రూ.332 కోట్ల ఆదాయం తగ్గింది. ఇక గత సెప్టెంబర్ నెలలో 99వేల 970 రిజస్ట్రేషన్లు జరగ్గా.. 820 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గత ఆగస్టు నెలతో పోలిస్తే సుమారు 500 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని లెక్కలు చెబుతున్నాయి. జూలై నెలతో పోలిస్తే 2 నెలల్లో దాదాపు 800 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది.

తెలంగాణలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం తగ్గిపోవడానికి అనేక కారణాలు చెబుతున్నారు అధికారులు. హైడ్రా కూల్చివేతలతో పాటు వరుసగా వచ్చిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కూడా రిజిస్ట్రేషన్లు తగ్గడానికి కారణంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం హైడ్రా ప్రభావంతో హెచ్ఎండీఏ, డీటీసీపీ అధికారులు అనుమతుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండటం కూడా రిజిస్ట్రేషన్ల తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది.

పూర్తి వివరాలు..

Also Read : ఢిల్లీకి సీఎం రేవంత్, క్యాబినెట్ విస్తరణపై ఉత్కంఠ.. ఛాన్స్ ఎవరికో..?