KCR Strategy: గులాబీ బాస్ టాప్‌గేర్.. కేసీఆర్ మార్కు చాణక్యం.. ఒకే దెబ్బతో అంతా సెట్!

పార్టీలో అసంతృప్తి అన్న మాటకు అసలు చాన్స్ లేకుండా చేశారు. ఇంతలా ఒకే దెబ్బతో మొత్తం రాజకీయాన్ని మార్చేసిన సీఎం కేసీఆర్ వ్యూహమేంటి?

CM KCR Strategy: రాజకీయ చాణక్యంలో తనకు తిరుగులేదని సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించారు. ఒకే దెబ్బతో మొత్తం తెలంగాణ రాజకీయం (Telangana Politics) తన గుప్పెట పట్టుకున్నారు గులాబీ బాస్. బీఆర్‌ఎస్ (BRS Party) అభ్యర్థుల ప్రకటన తర్వాత అసమ్మతి ఎగిసిపడుతుందని ప్రత్యర్థి పార్టీలు.. మునుగోడులో గెలిపించిన బలంతో ఆశల్లో విహరించిన వామపక్షాలు.. టిక్కెట్లు ఇవ్వకపోతే తడాఖా చూపుతామంటూ హెచ్చరించిన సొంత పార్టీ నేతలను ఏ మాత్రం లెక్క చేయకుండా తన స్టైలే వేరన్నట్లు తనకు మాత్రమే ప్రత్యేకమైన రాజకీయాన్ని ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. ఎన్నికలకు మూడు నెలల ముందే 114 మంది జాబితాను విడుదల చేసి రేసులో మిగిలిన వారికంటే బీఆర్‌ఎస్సే ముందున్నట్లు నిరూపించారు. పార్టీలో అసంతృప్తి అన్న మాటకు అసలు చాన్స్ లేకుండా చేశారు. ఇంతలా ఒకే దెబ్బతో మొత్తం రాజకీయాన్ని మార్చేసిన సీఎం కేసీఆర్ వ్యూహమేంటి?

తెలంగాణ ఎన్నికల రేసులో ఒకేసారి టాప్‌గేర్ వేసి తన స్పీడు ఏంటో చూపించారు సీఎం కేసీఆర్. ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులు జాబితా విడుదల చేయడం ద్వారా ఇటు స్వపక్షంలోని అసంతృప్తులు, అటు ప్రత్యర్థి పార్టీల నాయకులకు ఒకేసారి షాక్ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ టిక్కెట్లకు ఎక్కువ పోటీ ఉండటంతో.. ఆ పార్టీలో అసమ్మతి పెరిగే చాన్స్ ఉందని.. ఆ అసమ్మతులను మరింత రెచ్చగొట్టి ఎన్నికల్లో అధికార పార్టీని దెబ్బతీయొచ్చనే ఆలోచనల్లో ఉన్న ప్రత్యర్థులకు మాస్టర్‌స్ట్రోక్‌ (Master Stroke) ఇచ్చారు సీఎం. ప్రత్యర్థుల ఊహాలకు భిన్నంగా బీఆర్‌ఎస్ జాబితా ఉండటం.. ఒకటి రెండు చోట్ల తప్పితే ఎక్కడా అసమ్మతి లేకుండా చేయడమే కేసీఆర్ మార్కు చాణక్యం అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా కేసీఆర్ రాజకీయ ఎత్తుగడతో ప్రత్యర్థుల మైండ్‌బ్లాక్ అయిపోయింది. దమ్ముంటే సిట్టింగ్‌లకు సీట్లిచ్చి చూడండి.. మా సత్తా ఏంటో చూపిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy), బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) సీఎం కేసీఆర్‌ను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేసేవారు. ఇప్పుడు వారి సవాళ్లకు తగ్గట్టే దాదాపు సిట్టింగ్‌లు అందరికీ సీట్లిచ్చారు సీఎం. తొమ్మిది మందిని మార్చితే వారిలో ఒక్కరు తప్ప, మిగిలి వారంతా బాస్ చెప్పినట్లు చేస్తామని సైలెంట్‌గా ఉండిపోవడం బీఆర్‌ఎస్ బలాన్ని ఆవిష్కరించింది.

ధిక్కార స్వరాలకు చెక్
119 నియోజకవర్గాలకు 115 చోట్ల అభ్యర్థులను ఖరారు చేయడం ద్వారా పార్టీని ఎన్నికల మూడ్‌లోకి తీసుకెళ్లారు సీఎం. ఇంకా ప్రకటించాల్సిన 4 నియోజకవర్గాల్లో రెండు సీట్లకు కొత్త అభ్యర్థులు వస్తారని చూచాయగా చెప్పారు. కానీ, ఎక్కడా ఎటువంటి ధిక్కార స్వరాలు వినిపించకపోవడం కేసీఆర్ చాణక్యానికి నిదర్శనంగా చెబుతున్నారు. ఒక్క ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ మినహా ప్రస్తుతానికి మరెవరూ పార్టీ లైన్ దాటేలా లేరు. ప్రత్యర్థి పార్టీల ఊహాలకు భిన్నంగా.. బీఆర్‌ఎస్‌లో మెజార్టీ నియోజకవర్గాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థుల ఎంపికకు సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రకరకాల సర్వేలు.. ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారాన్ని తెప్పించుకున్న సీఎం.. గెలుపు గుర్రాలకే సీట్లు ఇచ్చారు. టిక్కెట్లు దక్కని వారిలో ఒకరిద్దరు సమర్థులైన నాయకులు ఉన్నప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లోనే వారిని తప్పించారు. ఇలాంటి వారిలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ఒకరు. ఆయనపై వ్యతిరేకత కన్నా.. పౌరసత్వ వివాదం వల్లే పక్కన పెట్టాల్సివచ్చిందని బీఆర్‌ఎస్ వర్గాల సమాచారం. ఇక కోరుట్ల ఎమ్మెల్యే స్వచ్ఛందంగా తప్పుకుని తన కుమారుడికి సీట్ ఇప్పించుకున్నారు. తాండూరులో టికెట్ ఆశించిన మహేందర్‌రెడ్డిని మంత్రి చేయనున్నారు. భూపాలపల్లి, స్టేషన్ ఘనపూర్‌ల్లో కూడా వేణుగోపాలచారి, రాజయ్యతో ముందే మాట్లాడి సెట్ చేశారు సీఎం కేసీఆర్.

Also Read: టికెట్‌ రాలేదని వెక్కి వెక్కి ఏడ్చిన బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే

సీఎంపై విధేయుత.. మెత్తబడ్డ ఆశావహులు
బోథ్ ఎమ్మెల్యే బాపురావు పార్టీ ఆదేశాలను పాటిస్తానని.. సీఎంపై విధేయుత చూపించారు. తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వలేదని మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి కూడా జాబితా ప్రకటన తర్వాత సర్దుకున్నారు. ఉప్పల్, వైరా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లను మార్చినా.. అక్కడ ఎలాంటి తిరుగుబాటు కనిపించకపోవడం కేసీఆర్ చాణక్యమేనంటున్నారు పరిశీలకులు. ఇక టిక్కెట్లు ఆశించిన కొత్తవారు.. ఉద్యమకారులు కూడా ఎలాంటి ధిక్కార ప్రకటనలు చేయడం లేదు. టిక్కెట్లు పొందిన వారికంటే తాము ఏ విధంగా ఉత్తమమో చెబితేకాని వారికి ప్రజాదరణ లభించదన్న విషయంతోపాటు.. వారిని కాదని సిట్టింగ్‌లకే ఎందుకు సీట్లు ఇవ్వాల్సివచ్చిందో పార్టీ వివరించడంతో చాలా మంది ఆశావహులు మెత్తబడ్డారు. అందరికంటే ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించడం వల్ల అసమ్మతులు ఎగిసే అవకాశం ఉందన్న విషయాన్ని పసిగట్టిన సీఎం.. జాబితా వెల్లడికి ముందే ఆశావహులతో మాట్లాడి అందరికీ అమోదయోగ్యమైన అభ్యర్థులనే తెరపైకి తెచ్చారు. సీఎంతోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కూడా పార్టీలో అసంతృప్తి రేగకుండా అదుపు చేయడంలో సక్సెస్ అయ్యారు. అందరితో ముందే మాట్లాడి.. అందరి ఆమోదం తీసుకున్నాకే తుదిజాబితా బహిర్గతం చేయడం ద్వారా ఎక్కడా ఎలాంటి ధిక్కారం కనిపించలేదు. వినిపించలేదు.

Also Read: అందుకే కేసీఆర్‌కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి తన దెబ్బ రుచి చూపించాలి: జూపల్లి కృష్ణారావు

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు నో చాన్స్ 
ఇదే సమయంలో తన రాజకీయం ముందు ప్రత్యర్థి పార్టీల ఆటలు చెల్లవని నిరూపించారు సీఎం కేసీఆర్. బీఆర్‌ఎస్ అసంతృప్తులు, అసమ్మతులు వస్తే సీట్లిస్తామని ఆశ చూపిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఆ చాన్స్ ఇవ్వలేదు సీఎం కేసీఆర్. ఒకరిద్దరు వెళితే వెళతారని ముందుగానే ఊహించిన బీఆర్‌ఎస్ బాస్.. ఎవరూ పార్టీ దాటకుండా కట్టడి చేయడంలోనూ సక్సెస్ అయ్యారంటున్నారు పరిశీలకులు. టిక్కెట్లు దక్కనివారిలో ఒక్క ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ మాత్రమే కాంగ్రెస్‌కు టచ్‌లోకి వెళ్లారు. ఆ నియెజకవర్గంలో బీఆర్‌ఎస్ క్యాడర్‌లో రేఖానాయక్‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్నందున.. రేఖానాయక్ పార్టీని వీడినా నష్టంలేదనే అంచనా వేసుకుంటోంది బీఆర్‌ఎస్ అధిష్టానం. ఇక టిక్కెట్లు ఆశించిన ద్వితీయశ్రేణి నాయకులు ఎవరు అసంతృప్తి చెందినా.. క్యాడర్ మాత్రం పార్టీకి కట్టుబడే ఉంటారని ఊహించింది గులాబీ దళం.. జాబితా ప్రకటన తర్వాత వారు ఊహించినట్లే.. ఎక్కడా ధిక్కారం వినిపించకపోవడంతో కారుపార్టీ నేతలు ఊపిరిపీల్చుకున్నారు. ఇదే సమయంలో ఇతర పార్టీ ద్వితీయ, తృతీయశ్రేణి నాయకులను కూడా పార్టీలోకి ఆకర్షించే ఆపరేషన్ మరోవైపు స్టార్ట్ చేయడంతో ఎన్నికల రేసులో స్పీడ్‌గా కనిపిస్తోంది కారుపార్టీ.

Also Read: బెల్లంపల్లిలో గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తా, ఎలా గెలుస్తాడో చూస్తా- శేజల్ హాట్ కామెంట్స్

వామపక్షాలకు ఝలక్
ఇలా పార్టీపైన.. ప్రత్యర్థులపైన ఆధిపత్యం ప్రదర్శించిన సీఎం.. వామపక్షాలకు ఝలక్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల సహకారం తీసుకున్న సీఎం.. భవిష్యత్‌లో తమ స్నేహం కొనసాగుతుందని ప్రకటించారు. ఐతే ఇప్పుడు ఏకపక్షంగా జాబితా ప్రకటించడంపై కమ్యూనిస్టు నేతలు కస్సుమంటున్నారు. కానీ, బీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులకు సీట్లు ఇచ్చి.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి నష్టం చేసుకోవడం కన్నా.. వామపక్ష నేతలు నొచ్చుకున్నా.. పార్టీని కాపాడుకోడానికే ప్రాధాన్యం ఇచ్చారు సీఎం కేసీఆర్.. ఐతే బీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం ఇన్నాళ్లు వేచిచూసిన కమ్యూనిస్టు నేతలు ఇప్పడు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పొత్తు కోసం కాంగ్రెస్ ప్రయత్నించినా.. కాదన్న వామపక్షాలు ఇప్పుడు హస్తంపార్టీతో జతకడతారా? లేక స్నేహపూర్వక పోటీ అంటూ బీఆర్‌ఎస్‌తో సర్దుకుపోతారో చూడాల్సివుంది.

Also Read: బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని కీలక ప్రకటన

ఎంఐఎం పార్టీతో మైత్రి
మరోవైపు కాంగ్రెస్, బీజేపీలతోపాటు వామపక్షాలకు ఝలక్ ఇచ్చిన సీఎం.. ఎంఐఎంతో మాత్రం మైత్రి బంధం కొనసాగించేందుకే మొగ్గుచూపినట్లు కనిపిస్తోంది. 50 సీట్లలో పోటీచేస్తామని మజ్లిస్ కవ్వించినా.. ఆ పార్టీ పట్ల మెతకవైఖరినే ప్రదర్శించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. మజ్లిస్ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో నామమాత్రపు పోటీకే పరిమితమయ్యేలా అభ్యర్థులను ప్రకటించింది బీఆర్‌ఎస్.. ఇలా గిట్టని వారికి… అటు మనసుకు నచ్చిన వారికి ఒకేసారి.. ఒకే జాబితాతో తన అంతరంగమేమింటో.. ఎన్నికలకు ఎలాంటి స్కెచ్ వేశారో చూపించారు సీఎం కేసీఆర్.. మొత్తానికి అసంతృప్తులు, అసమ్మత్తులకు తావు లేకుండా చేయడమే కేసీఆర్ ప్రదర్శించిన రాజకీయ చాణక్యమే తెలుగురాష్ట్రాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్.

ట్రెండింగ్ వార్తలు