కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి కాలం కొనసాగాలని ఆయన కోరుకుంటున్నారా? సీఎంగా రేవంత్ మరో మూడున్నరేళ్లు ఉండాలని ఆకాంక్షిస్తున్నారా? ఇలా కోరుకుంటుంది ఏ కాంగ్రెస్ నేతనో, రేవంత్ అభిమానో అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే.
ఎందుకంటే ఇలా కోరుకుంటుంది సాక్షాత్తు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అవును..మీరు వింటున్నది నిజమే. గులాబీ పార్టీని ఎన్నికల్లో ఓడించి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగాలని మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు కోరుకుంటున్నారు? ఇంతకీ గులాబీ బాస్ మనసులో ఉన్న ఆంతర్యమేంటి?
మాజీ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ అంతర్గత సమావేశాల్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తికాలం ఉండాలని, సీఎంగా రేవంత్ కొనసాగాలని కేసీఆర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇంతకీ కేసీఆర్ అలా ఎందుకన్నారు? రేవంత్‌నే సీఎంగా చూడాలని ఎందుకు కోరుకుంటున్నారు? అటు బీఆర్ఎస్‌తో పాటు ఇటు కాంగ్రెస్ లీడర్లూ ఈ విషయమై జోరుగా చర్చించుకుంటున్నారు..
ఏప్రిలో 27న పార్టీ రజతోత్సవ ఉత్సవాలను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేశారు కేసీఆర్.. ఇందుకోసం ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడినట్లు తెలుస్తోంది.. ఐతే ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆరే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఆటంకం లేకుండా పూర్తి కాలం అధికారంలో ఉండాలని కోరుకోవడమేంటనేది చర్చనీయాంశంగా మారింది.
కచ్చితంగా విసిగిపోతారని గులాబీ బాస్ అంచనా?
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సునాయాసంగా గెలవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలంపాటు అధికారంలో ఉండాలనేది మాజీ సీఎం కేసీఆర్ ఆకాంక్షగా తెలుస్తోంది.. అంతేకాదు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగతా మూడున్నరేళ్లు కొనసాగితేనే తమకు మంచి జరుగుతుందని కూడా కేసీఆర్ తమ పార్టీ నేతలతో అన్నారని సమాచారం.. సీఎంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనను చూస్తేనే బీఆర్ఎస్ విలువ ఏంటో జనానికి తెలుస్తుందని అధినేత కేసీఆర్ భావిస్తున్నారని నేతలు చెబుతున్నారు. ఇప్పటికే పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనను సరిపోల్చుకుంటున్న జనం.. మరో మూడున్నరేళ్లలో కచ్చితంగా విసిగిపోతారని గులాబీ బాస్ కేసీఆర్ అంచనా వేస్తున్నారని పార్టీవర్గాల్లో చర్చ నడుస్తోంది.
పదేళ్ల పాలనలో దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేశామని, ఎన్నికల హామీల్లో లేని పథకాలను కూడా తీసుకొచ్చి జనానికి మంచి చేశామనేది బీఆర్ఎస్ భావన.. కేంద్రం కూడా తమ పథకాలను కాపీ కొట్టిందని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలు చెప్పే మాట.. ఐతే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఇచ్చిన గ్యారెంటీలను సైతం అమలు చేయలేక చేతులెత్తేసిందని, అదే తమకు అస్త్రం అవుతుందని కేసీఆర్ పార్టీ నేతలతో అన్నట్లు తెలుస్తోంది.
రైతు రుణమాఫీని వంద శాతం చేయలేదని, ఎకరాకు 15 వేల రైతు భరోసా హామీ నెరవేరలేదనేది బీఆర్‌ఎస్ వెర్షన్.. ఆ అంశాలనే జనంలోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని నేతలకు చెప్పారంట కేసీఆర్.. ఇక మహిళలకు 2,500, వృద్ధాప్య పెన్షన్ పెంపు లాంటి హామీలేవీ అమలవకపోవడంతో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే నమ్మకం పోయిందని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారట. ఇలాంటి అంశాలన్నీ బీఆర్ఎస్ గెలుపుకు సహకరిస్తాయని పార్టీ నేతలకు వివరించి మరీ చెప్తున్నారంట కేసీఆర్..
పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనను జనం పోల్చుకుంటున్నారని ఇప్పటికే వ్యతిరేకత కూడా మొదలైందని పార్టీ నేతలతో కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది.. కాంగ్రెస్ ఇలాగే ఐదేళ్లు పాలిస్తే ఆ తరువాత జనం మళ్లీ కాంగ్రెస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించరని, ఇక అధికారం మనదే అవుతుందని పార్టీ నేతలతో కేసీఆర్ అన్నట్లు సమాచారం.
ప్రజా వ్యతిరేకత ఉన్న అంశాలన్నింటిపైనా జనంలోకి వెళ్లాలని కూడా నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.. ఏది ఏమైనా కాంగ్రెస్ తప్పులు మనకు ప్లస్ అవుతాయనే కేసీఆర్ మాటలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో బిగ్ డిబేట్‌కు దారి తీస్తున్నాయి.. మరి దీన్ని కాంగ్రెస్ ఏ విధంగా తిప్పి కొడుతుందో చూడాలి మరి..