Warangal: ఎమ్మెల్యే రాజయ్యను పక్కన పెట్టడంతో.. టెన్షన్ పడుతున్న ఎంపీ దయాకర్‌!

ఎమ్మెల్యే రాజయ్యకు.. ఎంపీ దయాకర్‌కు లింకేమిటి? అని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. కానీ స్టేషన్‌ ఘన్‌పూర్ రాజకీయానికి.. వరంగల్ ఎంపీ సీటుకు మధ్య ఫెవికాల్ బంధం ఒకటి అల్లుకుంది.

why warangal mp tensioned after mla rajaiah not getting ticket?

Warangal MP: ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు.. బీఆర్‌ఎస్‌లో ఓ ఎంపీ పరిస్థితి తయారైంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా.. అధికార పార్టీలో ఎమ్మెల్యే టికెట్ల రగడ.. ఎక్కడ తన సీటుకు ఎసరుపెడుతోందోననే టెన్షన్ పడుతున్నారట ఆ ఎంపీ. టికెట్ దక్కని ఎమ్మెల్యేను బుజ్జగించే పనిలో బీఆర్‌ఎస్ బాస్.. తన నియోజకవర్గాన్ని ఎరగా వేశారనే టాక్.. సదరు పార్లమెంట్ సభ్యుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతకీ ఎవరా ఎంపీ.. ఏమిటా కథ.. తెరవెనుక రాజకీయం ఏంటో చూద్దాం.

అధికార బీఆర్‌ఎస్‌లో టికెట్ల రగడ ఇంకా కొలిక్కి రావడం లేదు. ఆశావహులు.. అసమ్మతులు.. టికెట్లు దక్కని సిట్టింగ్‌లను అనేక రకాలుగా బుజ్జగించే పనిచేస్తోంది అధికార పార్టీ.. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ చోట సిట్టింగ్‌కు చాన్స్ ఇవ్వని గులాబీబాస్.. మరో స్థానాన్ని పెండింగ్‌లో పెట్టారు. అయితే స్టేషన్ ఘన్‌పూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్ నిరాకరించడం.. ఆయన పార్టీకి విధేయుడిగా ఉంటానంటూనే హాట్ హాట్ కామెంట్స్ చేస్తుండటంతో ఉలిక్కిపడుతున్నారు వరంగల్ ఎంపీ దయాకర్.

ఎమ్మెల్యే రాజయ్యకు.. ఎంపీ దయాకర్‌కు లింకేమిటి? అని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. కానీ స్టేషన్‌ ఘన్‌పూర్ రాజకీయానికి.. వరంగల్ ఎంపీ సీటుకు మధ్య ఫెవికాల్ బంధం ఒకటి అల్లుకుంది. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రాజయ్యను తప్పించి.. అప్పటి ఎంపీ కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు సీఎం కేసీఆర్.. దీంతో వరంగల్ ఎంపీగా ఉప ఎన్నికల్లో గెలిచారు దయాకర్.. ఐతే 2018లో కడియం ఎమ్మెల్సీగా ఉండటంతో రాజయ్య మళ్లీ స్టేషన్ ఘన్‌పూర్ నుంచి.. దయాకర్ 2019లో వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు.

Also Read: బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఎందుకొచ్చారు.. ఎందుకు వెళ్లిపోతున్నారు?

ఇన్నాళ్లు అంతా సవ్యంగా నడవగా.. ఇప్పుడు రాజయ్యను పక్కన పెట్టి.. కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు సీఎం కేసీఆర్. దీంతో ఎమ్మెల్యే రాజయ్య అలకపాన్పు ఎక్కారు. ఇదేసమయంలో బలమైన మాదిగ సామాజిక వర్గానికి చెందిన రాజయ్యను పక్కకు తప్పించడంపైనా కొంత వ్యతిరేకత కనిపించింది. దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే రాజయ్యను ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Also Read: ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?

కేటీఆర్ ఏం హామీ ఇచ్చారో ఎవరికీ తెలియనప్పటికీ.. ఎంపీ దయాకర్ మాత్రం తెగ టెన్షన్ పడుతున్నట్లు చెబుతున్నారు. రాజయ్య, శ్రీహరి మధ్య పదవుల పంపకంలో తనకు అనూహ్యంగా ఎంపీ సీటు దక్కితే.. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య టికెట్ పంపకంలో వచ్చిన తేడా తన పదవికి గండం తెస్తుందేమోనని అనుమానిస్తున్నారు ఎంపీ దయాకర్.. స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజవర్గంలో మాదిగ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. రాజయ్య ఎఫెక్ట్‌తో ఆ ఓట్లు నష్టపోకుండా ఉండాలంటే.. రాజయ్యకు ప్రత్యామ్నాయం చూపాల్సివుంటుందని అంటున్నారు. ఈ ప్రత్యామ్నాయమే వరంగల్ ఎంపీ టికెట్ అనే టాక్ సిట్టింగ్ ఎంపీని కలవరపెడుతోంది. ఎంపీ దయాకర్ కూడా మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతే కావడంతో రాజయ్య రూపంలో ఎదురవుతున్న పోటీతో నిద్రలేని రాత్రలు గడుపుతున్నారట ఎంపీ.

ట్రెండింగ్ వార్తలు