PrajaaVaani: గాంధీభవన్‌లో ప్రజావాణి కొనసాగుతుందా? ఎత్తేశారా?

ప్రజాభవన్‌లో ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లే..క్యాడర్‌ కోసం పార్టీ ఆఫీస్‌లో ప్రజావాణి నిర్వహించి సమస్యలు సాల్వ్‌ చేయాలనుకున్నారు.

Gandhi Bhavan

నెల రోజులుగా గాంధీభవన్‌లో ప్రజావాణి జరగడం లేదు. మంత్రులెవరూ గాంధీభవన్‌ దిక్కు చూడకపోవడంతో సమస్యలు చెప్పుకుందామని వస్తున్న కార్యకర్తలు, ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. దీంతో అసలు ఉన్నట్లుండి పార్టీ ఆఫీస్‌లో ప్రజావాణి కార్యక్రమం ఎందుకు ఆగిపోయిందన్న చర్చ జరుగుతోంది. గాంధీభవన్‌లో ప్రజావాణి కొనసాగుతుందా లేక ఎత్తేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఆఫీస్‌లో ప్రజావాణి కార్యక్రమం జరగకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.

పదేళ్ల తర్వాత పార్టీ పవర్‌లోకి ఉంది. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో అధికారం కట్టబెట్టారు. అందుకే ప్రజలు, పార్టీ క్యాడర్‌ కోసం పీసీసీ తరఫున ఒక కొత్త కార్యక్రమం చేయాలనుకున్నారు. అందులో భాగంగానే గాంధీభవన్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

ప్రజాభవన్‌లో ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లే..క్యాడర్‌ కోసం పార్టీ ఆఫీస్‌లో ప్రజావాణి నిర్వహించి సమస్యలు సాల్వ్‌ చేయాలనుకున్నారు. ప్రతి బుధ, శుక్రవారం ఒక మంత్రి మూడు గంటల పాటు గాంధీ భవన్‌కు వచ్చి పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేలా ప్రణాళిక రూపొందించింది పార్టీ. అంతేకాదు పదిహేను రోజులకు ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి కూడా గాంధీభవన్‌లో నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని చెప్పింది పీసీసీ.

రెండు నెలల పాటు బాగానే జరిగి..
గతేడాది సెప్టెంబర్ 27న గాంధీభవన్‌లో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమం రెండు నెలల పాటు బాగానే జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని పార్టీ క్యాడర్, ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

పార్టీ ఆఫీస్‌లో మంత్రులు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. అందుకు అనుగుణంగానే మంత్రులు వెంటనే సమస్యలను పరిష్కారమయ్యే దిశగా ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు గాంధీభవన్‌లో ప్రజావాణిపై కొంత నమ్మకం పెరిగింది. కానీ సడెన్‌గా గాంధీభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం ఆగిపోవడం చర్చనీయాంశమవుతోంది.

నెల రోజులుగా గాంధీభవన్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించకపోవడానికి కారణమేంటన్న చర్చ మొదలైంది. గతేడాది డిసెంబర్ 5 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు నెల రోజులుగా మంత్రులెవరు గాంధీభవన్‌లో ప్రజావాణికి హాజరుకావడం లేదు. అయితే ప్రతి బుధవారం, శుక్రవారం ప్రజావాణి జరుగుతుందన్న నమ్మకంతో కార్యకర్తలు, ప్రజలు మాత్రం గాంధీభవన్‌కు వస్తున్నారు. తీరా వచ్చాక మంత్రులు లేకపోవడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. దాంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ప్రజావాణి కార్యక్రమం ఇలా అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బిజీ అయిపోయారా?
ఈ మధ్యకాలంలో మంత్రులు బిజీగా మారిపోయారని, అందుకే గాంధీభవన్ వైపు రావడం లేదని అంటున్నారు. మరోవైపు పీసీసీకి, మంత్రులకు సమన్వయ లోపం కనిపిస్తోందని, అందుకే మంత్రులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావడం లేదన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రజావాణి కార్యక్రమాన్ని ముందుగానే షెడ్యూల్ చేసి, మంత్రులకు సమాచారం ఇవ్వడంలో సమస్య ఎదురవుతోందన్న టాక్ వినిపిస్తోంది.

మంత్రులు కూడా ఎక్కువగా జిల్లాల పర్యటనలకు వెళ్తుండటంతో గాంధీభవన్‌లో జరిగే ప్రజావాణికి సమయం ఇవ్వలేకపోతున్నారట. ఇక పదిహేను రోజులకు ఓ సారి ముఖ్యమంత్రి కూడా గాంధీభవన్‌లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని ప్రకటించిన పీసీసీ, ఒక్కసారి కూడా సీఎం రేవంత్‌ని గాంధీభవన్‌కు తీసుకురాలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి.

ప్రజా ప్రభుత్వంలో గాంధీభవన్‌కు రండి, మీ సమస్యలు చెప్పుకోండని చెప్పిన కాంగ్రెస్ పార్టీ..ఇలా ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా ప్రజావాణి కార్యక్రమాన్ని నిలిపివేయడంపై అయితే ఆసక్తికర చర్చే జరుగుతోంది. రానున్ను రోజుల్లో గాంధీభవన్‌లో ప్రజావాణి కొనసాగుతుందా.? లేకపోతే ఇక గంతే సంగతులా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Chilakaluripet: చిలకలూరిపేటలో మాజీమంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ