Chilakaluripet: చిలకలూరిపేటలో మాజీమంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ
ఐదుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామాలు ఛైర్మన్ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి.

పేటకు నేనే మేస్త్రి. ముఠా మేస్త్రి. అంటూ ఆ ఇద్దరు నేతలు నియోజకవర్గ ఇంచార్జ్ కోసం పోటీ పడ్డారు. చిలకలూరిపేట వైసీపీ ఇంచార్జ్‌గా మళ్లీ మాజీమంత్రి విడదల రజినిని నియమించారు జగన్. దీంతో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన దారి తాను చూసుకునేందుకు రెడీ అవుతున్నారట. ఆ మధ్య విడదల రజిని జనసేన వైపు చూస్తున్నారు..జంప్ అవుతారని ప్రచారం జరిగింది. ఇంతలోనే ఆమెను బుజ్జగించేందుకు తిరిగి చిలుకలూరిపేట నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. ఆమెకు పెద్దపీట వేయడం నచ్చని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ హర్ట్ అయ్యారట.
పార్టీ కోసం అన్నీ తానై నిలబడ్డ తనను కాదని..ఆమెకు టికెట్ ఇచ్చి..అమాత్య పదవి ఆచ్చారు. అయినా సరే అని ఊరుకున్నా. ఇప్పుడు మళ్లీ ఆమెకు బాధ్యతలు ఇచ్చారు. ఇక నేనేందుకు మరి ఇక్కడ ఉండి అంటూ..ఆగ్రహంతో ఉన్నారట మర్రి రాజశేఖర్. దాంతో మాజీమంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్లుగా మారాయి చిలకలూరిపేట నియోజకవర్గం వైసీపీ పాలిటిక్స్. రజిని రీఎంట్రీపై రగిలిపోతున్న మర్రి రాజశేఖర్..ఇక వైసీపీలో ఉంటే లాభం లేదని ఫిక్స్ అయిపోయారట.
టికెట్ ఇస్తారో లేదోనని అలర్ట్
అధినేత మాటను కాదనలేక పార్టీలో ఉంటే..తనకు జరిగిన న్యాయం ఏంటంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఎలక్షన్ జరగడానికి ఇంకా నాలుగేళ్లు ఉండగానే ఆమెను తీసుకొచ్చి నియోజకవర్గ సమన్వయకర్తను చేస్తే..ఇక ఎన్నికలప్పుడు ఈక్వేషన్లు, సమీకరణాలు అంటూ..టికెట్ ఇస్తారో లేదోనని..అలర్ట్ అయిపోతున్నారట. ఎన్నాళ్లు వెయిట్ చేస్తామ్..జంప్ అయ్యే సమయం ఆసన్నమైందనుకుంటున్నారట.
చిలకలూరిపేటలో వైసీపీకి మొదటి నుంచి మర్రి రాజశేఖర్ కీలక నాయకుడిగా ఉన్నారు. ఆయన 2004లో ఇండిపెండెంట్‌గా గెలిచి..వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో చేరిపోయారు. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడారు. జగన్ పార్టీ పెట్టాక ఆయన వెంట నడిచిన కొందరు నేతల్లో మర్రి రాజశేఖర్ ఒకరు. అలా వైసీపీలో మొదటి నుంచి ఉన్న నేతగా మర్రి రాజశేఖర్‌కు గుర్తింపు ఉంది. అయితే 2014లో జగన్ ఆయనకు చిలకలూరిపేట టికెట్ ఇచ్చినా గెలవలేకపోయారు.
దాంతో మర్రి రాజశేఖర్‌ను కాదని..టీడీపీ నుంచి విడదల రజినికి 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు జగన్. వైసీపీ ప్రభంజనం, బీసీ కార్డుతో రజిని గెలిచారు. ఇక 2024 ఎన్నికల నాటికి రజిని మంత్రి అయినా కూడా నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత రావడంతో ఆమెను గుంటూరు వెస్ట్‌కు పంపించారు. అప్పుడు చిలకలూరిపేట టికెట్ ఆశించినా మర్రి రాజశేఖర్‌కు అవకాశం లభించలేదు.
2019లో తన సీటు త్యాగం చేసిన మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీని చేశారు. అంతేకాదు మంత్రిగా అవకాశం ఇస్తానని జగన్ బహిరంగ సభలో ప్రకటించారు. అయితే సామాజిక సమీకరణాలు నేపథ్యంలో అది జరగలేదు. పార్టీలో ప్రాధాన్యత ఇచ్చినా అమాత్య పదవి దక్కకపోవడంతో మర్రి అసంతృప్తిగానే ఉన్నారు. మొదటి నుంచి రజినిని వ్యతిరేకిస్తున్న మర్రి రాజశేఖర్ ఇప్పుడు మళ్లీ ఆమెను పేటకు తీసుకురావడంతో..పార్టీ నుంచి బయటికి వెళ్లిపోడానికే మొగ్గు చూపుతున్నారని చర్చ నడుస్తుంది. అయితే తనకు చిరకాల ప్రత్యర్థిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావుతో జతకడతారా లేక జనసేన వైపు వెళ్తారోనన్నది ఆసక్తికరంగా మారింది.
పవన్ ఒప్పుకోలేదని గుసగుసలు
ఎన్నికలు అయిపోయాయి. పార్టీ పరాభవం పాలైంది. మాజీమంత్రి విడదల రజిని కూడా ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె సైలెంట్ అయిపోయారు. జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారన్న ప్రచారం ఉంది. బాలినేని శ్రీనివాస్ ద్వారా జనసేన కండువా కప్పుకునేందుకు పావులు కదిపారని..పవన్ ఒప్పుకోలేదని గుసగుసలు వినిపించాయి.
ఇంతలోనే అలర్ట్ అయిన జగన్ విడదల రజినిని బుజ్జగించారట. ఆమె అడిగినట్లుగా మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే మొదటి నుంచి పార్టీలో ఉన్న మర్రి రాజశేఖర్‌కే ఇంచార్జి పదవి ఇవ్వాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తూ వస్తోంది. ఆయనకు ఇంచార్జ్ ఇస్తేనే టీడీపీని ఓడించి నెగ్గగలమని అంటున్నారు. మాజీ మంత్రి విడదల రజినికి బాధ్యతలు అప్పగించొద్దని కోరినట్లుగా కూడా ప్రచారం సాగింది. అయినా వైసీపీ అధినేత ఆమెనే నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం మర్రికి, ఆయన అనుచరులకు అస్సలు నచ్చడం లేదట. అందుకే పార్టీ మారితేనే బెటర్ అనే ఆలోచనకు వచ్చారట.
ఎన్నికల్లో ఘోరంగా ఓడిన తర్వాత వైసీపీని వీడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు జంప్ అవుతుండటం ఒక ఎత్తు అయితే.. పార్టీ సిట్టింగ్ MLCలు, రాజ్యసభ సభ్యులు పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోవడం ఫ్యాన్ పార్టీ కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ ముగ్గురు రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడారు.
ఐదుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామాలు ఛైర్మన్ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు త్వరలో రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఆ ఇద్దరిలో మర్రి రాజశేఖర్ ఒకరని టాక్. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ కూడా ఫ్యాన్ పార్టీనీ వీడేందుకు రెడీ అయ్యారట. ఇంకెవరెవరు వైసీపీని వీడుతారో.. టీడీపీ, జనసేన కండువాలు కప్పుకునే ఎమ్మెల్సీలు ఎవరో చూడాలి మరి.
కేటీఆర్ ఏసీబీ విచారణ రోజు హైడ్రామా.. విచారణకు సహకరించలేదంటూ అరెస్ట్ చేస్తారా?