కేటీఆర్ ఏసీబీ విచారణ రోజు హైడ్రామా.. విచారణకు సహకరించలేదంటూ అరెస్ట్ చేస్తారా?
అసలు ఈ కేసులో తనను విచారించాల్సిన అవసరమే లేదన్న కేటీఆర్.. ఏలాగైనా తనను అరెస్ట్ చేయించాలన్న కోణంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవన్నీ చేయిస్తున్నారని మండిపడ్డారు.

KTR
కేటీఆర్ దర్యాప్తుకు సహకరించడం లేదు.. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు.. ఇది ఏసీబీ వాదన. అసలు నన్ను విచారణకు పిలవాల్సిన అవసరమే లేదు.. నన్ను కేసులో బలవంతంగా ఇరికించేందుకు కుట్ర జరుగుతోంది.. ఇది కేటీఆర్ వెర్షన్. ఈ కార్ రేస్ ఏసీబీ కేసులో కేటీఆర్ విచారణ సందర్బంగా జరిగిన హైడ్రామాలో ఎవరి వాదన వారిది.
ఓ వైపు ఈ కేసులో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయగా.. అంతలోనే ఏసీబీ కేటీఆర్ ను విచారణకు పిలవడం, ఆయనతో పాటు వచ్చిన అడ్వకేట్స్ ను అనుమతించకపోవడంతో ఈ కేసు ఏ మలుపు తిరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు ఆదేశించినా విచారణకు సహకరించలేదన్న కారణంతో ఏక్షణంలోనైనా కేటీఆర్ ను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.
హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసును విచారిస్తున్న ఏసీబీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును తిజర్వ్ చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపణ
ఐతే అంతలోనే ఈ- కార్ రేస్ కేసులో విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వగా.. తన అడ్వకేట్స్ తో కలిసి ఏసీబీ కార్యాలయానికి వచ్చారు కేటీఆర్. కానీ విచారణకు ఆయన అడ్వకేట్స్ ను అనుమతించలేమని, కేటీఆర్ ఒక్కరే విచారణకు రావాలని ఏసీబీ అధికారులు చెప్పడంతో అందుకు ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏసీబీ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేటీఆర్.. ఏపీసీ నోటీసులకు లిఖితపూర్వక సమాదానం ఇచ్చి వచ్చేశారు.
ఈ కార్ రేసింగ్ కేసులో తనను ఇరికించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఈ సందర్భంగా ఆరోపించారు. తన ఇంట్లో ఏసీబీ సోదాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని, తన దగ్గర ఏంలేకపోయినా.. ఇంట్లో తనకు సంబందం లేని పత్రాలను సాక్షాల రూపంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆనుమానం వ్యక్తం చేశారు.
అరెస్ట్ చేయించాలని ప్లాన్?
అసలు ఈ కేసులో తనను విచారించాల్సిన అవసరమే లేదన్న కేటీఆర్.. ఏలాగైనా తనను అరెస్ట్ చేయించాలన్న కోణంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవన్నీ చేయిస్తున్నారని మండిపడ్డారు. అయినప్పటికీ తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, ఖచ్చితంగా ఈ కేసులో నిర్ధోషిగా బయటకు వస్తానని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు వచ్చే వరకు విచారణను వాయిదా వేయాలని ఏసీబీ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు కేటీఆర్.
కేసుకు సంబంధించి ఏసీబీ వెర్షన్ మాత్రం మరోవిధంగా ఉంది. ఈ కార్ రేస్ కేసులో విచారణకు సహకరించాలని స్వయంగా హైకోర్టు చెప్పినా కేటీఆర్ పట్టించుకోవడం లేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. కేటఆర్ కేసు విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదేని ఆరోపిస్తున్నారు.
ఈ కేసులో కేవలం కేటీఆర్ ను వ్యక్తిగతంగా విచారణకు పిలిచామని, కానీ ఆయన అడ్వకేట్స్ ను తీసుకుని వచ్చి విచారణకు ఆటంకం కలిగించాలని చూశారని చెబుతున్నారు. అందుకే కేటీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేయడంతో పాటు ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళే దిశగా ఏసీబీ అధికారులు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశించినా కేటీఆర్ విచారణకు సహకరించడం లేదు కాబట్టి ఆ కారణాన్ని చూపి ఏక్షంలోనైనా ఏసీబీ ఆయనను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ ఓ రేంజ్‌లో సాగుతోంది.
HMPV : HMP వైరస్ కలకలం.. ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు- మంత్రి సత్యకుమార్ యాదవ్