MLA Durgam Chinnaiah
Durgam Chinnaiah – BRS: తెలంగాణ(Telangana)లోని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను మోసం చేశారని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బాధితురాలు న్యాయం కోసం ఢిల్లీలో పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఢిల్లీ(Delhi)లోని బీఆర్ఎస్ తాత్కాలిక భవనం ఎదుట ఆమె ఇవాళ కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.
ఆడపిల్లల వైపు అసభ్యంగా చూసిన వారి కళ్లు పీకేస్తానని గతంలో సీఎం కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లకు జరిగిన అన్యాయం గురించి సీఎం కేసీఆర్ కనీసం పట్టించుకోవడం లేదని ఆమె చెప్పారు. తాను దేశ రాజధానిలో 25 రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ న్యాయం జరగడం లేదని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తుంటే, తాను ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి కనబడటం లేదా అని ప్రశ్నించారు. ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా తనపై తప్పుడు కేసులు పెట్టించారని ఆమె చెప్పారు.
తన జీవితాన్ని సర్వ నాశనం చేశారని అన్నారు. తనకు వెంటనే న్యాయం చేయాలని, లేదంటే ఢిల్లీలోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. కాగా, బాధితురాలు ఇటీవల ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.