వామ్మో.. దోసలో బొద్దింకలు, పూరీలో పురుగులు..! హైదరాబాద్ హోటల్స్‌లో దారుణాలు

నోరూరించే దోస, పూరీ తిందామని హోటల్ కు వెళ్లిన ఓ ఇద్దరు కస్టమర్లకు హైదరాబాద్ లోని వేర్వేరు హోటల్స్ లో ఊహించని ఘటనలు ఎదురయ్యాయి.

Hyderabad Hotels : సరదాగా ఫ్యామిలీతో కలిసి ఏదైనా హోటల్ కి వెళ్లి ఇష్టమైన ఫుడ్ తిందామని ఆశపడుతున్నారా? లొట్టలేసుకుంటూ టేస్టీ ఫుడ్ టేస్ట్ చేద్దామని అనుకుంటున్నారా? అయితే, బీకేర్ ఫుల్. మీ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడొచ్చు. మీరు జబ్బుల బారిన పడి మంచం ఎక్కొచ్చు. ఏంటి షాక్ అయ్యారా? అవును.. హైదరాబాద్ లోని కొన్ని హోటల్స్ లో దారుణాలు వెలుగుచూస్తున్నాయి. హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణం దర్శనమిస్తోంది. ఆహారంలో బొద్దింకలు, పురుగులు దర్శనమిస్తున్నాయి. దీంతో కస్టమర్లు కంగుతింటున్నారు.

నోరూరించే దోస, పూరీ తిందామని హోటల్ కు వెళ్లిన ఓ ఇద్దరు కస్టమర్లకు హైదరాబాద్ లోని వేర్వేరు హోటల్స్ లో ఊహించని ఘటనలు ఎదురయ్యాయి. బొద్దింకలు, పురుగులు చూసి బిత్తరపోయారు. వారికి కడుపులో తిప్పేసినట్లు అయ్యింది. ఇదేమని కస్టమర్లు ప్రశ్నిస్తే.. హోటల్స్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. అంతేకాదు భౌతిక దాడులకు దిగుతాం అంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

హైదరాబాద్ హబ్సిగూడలోని స్వాతి టిఫిన్ సెంటర్ కి తన స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ వ్యక్తి దోస ఆర్డర్ ఇచ్చాడు. దోస తింటూ ఉండగా అందులో బొద్దింక దర్శనం ఇచ్చింది. దాన్ని బయటకు తీస్తుండగా మరో బొద్దింక కనిపించింది. దీంతో కంగుతిన్న ఆ కస్టమర్ హోటల్ సిబ్బందిని ప్రశ్నించాడు. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. పైగా బయటి నుంచి 15మందిని పిలిపించి ఆ కస్టమర్ కి వార్నింగ్ ఇప్పించారు. దిక్కున్న చోట చెప్పుకో అంటూ హోటల్ నుంచి బయటకు పంపేశారు.

గడ్డి అన్నారంలోనూ ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. రాఘవేంద్ర హోటల్ లో పూరీ ఆర్డర్ ఇస్తే అందులో పురుగు వచ్చింది. ఇదేంటని హోటల్ నిర్వాహకులను ప్రశ్నిస్తే వారి నుంచి కూడా నిర్లక్ష్యంగా సమాధానం వచ్చిందని బాధితుడు వాపోయాడు.

ఇలాంటి ఘటనలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. హోటల్స్ కు వెళ్లి తినాలంటేనే భయపడిపోతున్నారు. హోటళ్ల నిర్వాహకులు శుచి, శుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అపరిశుభ్ర వాతావరణంలోనే ఆహారం వండి కస్టమర్లకు పెడుతున్నారు. నాణ్యత లేని, నాసిరకమైన, గడువు తీరిపోయిన పదార్దాలతోనే వండి వడ్డిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.

Also Read : కరెంట్ వైర్లతో జాగ్రత్త, లేదంటే ప్రాణాలకే ప్రమాదం.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిందో చూడండి..